స్టార్‌ హీరోయిన్‌ సమంత చాలా కాలం తర్వాత తెలుగు తెరపై మెరవబోతుంది. ఈ సారి పాన్‌ ఇండియా రేంజ్‌లో సందడి చేయబోతుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న `యశోద` చిత్రం రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌.నవంబర్‌ 11న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఓ సారి రిలీజ్‌ డేట్‌ని ఆవిష్కరించారు. వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ ఆలస్యం కారణంగా ఇప్పుడు మరోసారి రిలీజ్‌ డేట్‌ని వెల్లడించారు.సోమవారం రోజున `యశోద` విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్‌ని వినూత్నంగా ఆవిష్కరించడం విశేషం. సినిమా సైట్‌లోకి వెళ్లి క్లిక్‌ చేస్తే ఒక్కో బాక్స్ ఓపెన్‌ అవుతూ చివరగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ రివీల్‌ అయ్యింది. సర్‌ప్రైజింగ్ గా ఉన్న ఈ పోస్టర్‌కి మంచి స్పందన లభించింది. ఈ సినిమా ప్రమోషన్స్ విభిన్నంగా ప్లాన్‌ చేశారనే విషయాన్ని ఈ పోస్టర్‌ని చూస్తుంటే తెలుస్తుంది. ఇక సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ఇందులో సమంత మెయిన్‌
ఇందులో సమంత మెయిన్‌ లీడ్‌గా నటించగా, హరి, హరీష్‌ దర్శకత్వం  వహించారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది. ఇందులు సమంత బయట జీవితం ఒకలా, కలలో జీవితం మరోలా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఉన్న ఆమె సంతోషంగా ఉండాల్సింది. కానీ ఏదో భయానక శక్తులు ఆమెని వెంటాడుతుంటాయి. ఆమె నిత్యం కనిపించని శక్తులతో పోరాడుతుంటుంది. మరి ఆ కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటోంది యూనిట్.

దీని గురించి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, `ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్. సాధారణంగా థ్రిల్లర్ అంటే మిస్టరీ అనుకుంటారు. కానీ, ఇందులో హ్యుమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. వినూత్నమైన కథతో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ `యశోద`. టైటిల్ పాత్రలో సమంత అద్భుతంగా నటించారు. యాక్షన్ సన్నివేశాల కోసం ట్రైనింగ్ తీసుకుని, చాలా ఎఫర్ట్స్ పెట్టి క్యారెక్టర్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారు. మణిశర్మ నేపథ్య సంగీతం కొత్త డైమెన్షన్‌లో ఉంటుంది. ఈ వారంలో సెన్సార్ పూర్తవుతుంది. సాంకేతికంగా ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా భారీ నిర్మాణ వ్యయంతో 100 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. కొత్త కంటెంట్ కావాలని కోరుకునేప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం 'యశోద'లో ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నవంబర్ 11, 2022న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తాం` అని చెప్పారు.సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి మరియు హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: