ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతీ ఇంటి మనిషి. ఆయన గాన గంధర్వుడు. శాపవశాత్తు మన మన మధ్యన పుట్టి నడయాడిన మేటి సంగీత శిఖరం. ఆయన లేకుండా నెల రోజులు ఇట్టే తిరిగిపోయాయి. అదిగో బాబు ఆసుపత్రి నుంచి వచ్చేస్తున్నాడు అని ఆశపడినంతసేపు పట్టలేదు ఆయన అస్తమయం వార్త వినాల్సివచ్చింది. బాలు కానరాని గంధర్వ లోకాలకు వెళ్ళిపోయాడు. ఆయన వేల పాటలు అలా ప్రతి నిత్యం మదిలో తెనేలు ఊరుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే బాలు అంటే ఒక్క సినిమా పాట మాత్రమే కాదు, తెలుగు భాష మీద ఆన చేసి మాట్లాడే అమృతం లాంటి మాట. అంతేనా తెలుగు జాతికి కట్టుబాట్లు నేర్పే పెద్ద మాస్టర్ ఆయన.  ఇక ఈటీవీ ద్వారా వేలాది మంది నూతన గాయకులకు జన్మను ఇచ్చిన సంగీత జనకుడు.

మరి బాలు ప్రతి ఇంటికీ చేరువ అయ్యారు అంటే పాడుతా తీయగా పాత్ర అందులో చాలానే  ఉంటుంది. బాలూ కోసమే ఆ కార్యక్రమం చూసే వారే అధిక శాతం ఉంటారంటే అతిశయోక్తి కాదు. సంగీతంలో సాపాసాలు తెలియని వారు కూడా స్వరం గురించి నేర్చుకునేలా బాలూ అందులో చెప్పే వారు. ఇక బాలూ తన వ్యాఖ్యానంతో పాటు పాత సినిమా  విషయాలు, ఆ పాట పుట్టుక వెనక ఉన్న కధలు చెబుతూ ప్రేక్షకులను  రంజింపచేసేవారు.

అటువంటి బాలూ లేని పాడుతా తీయగా మూగపోతుందంటే సందేహమేలేదు. బాలూ లేరని తెలిసిన వేళ ఈటీవీ పెద్ద రామోజీవారు దాదాపుగా ఏడ్చేశారు. ఆయన తన వీడియో సందేశంలో బాలూ లేని లోటుని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. మరి బాలూ ఈ రోజు ఎటూ లేరు. ఆయన రూపుదిద్దిన పాడుతా తీయగా కార్యక్రమం కొనసాగుతుందా అన్నదే అందరి చర్చగా ఉంది. అయితే దీని మీద ఈటీవీ యాజమాన్యం, ప్రత్యేకించి రామోజీరావు కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. అదేంటి అంటే ఇకపైనా పాడుతా తీయగా కార్యక్రమం ఈటీవీలో ఉండదుట. అది బాలూ మీద గౌరవంతో, అభిమానంతో ప్రేమతో ఇస్తున్న ఘన నివాళిగా చెబుతున్నారు. ఆ కార్యక్రమం చేస్తే బాలూనే చేయాలి. లేకపోతే లేదు అన్నదే ఈటీవీ పెద్దల నిర్ణయమని అంటున్నారు. అదే కనుక జరిగితే బాలూకి ఇంతకంటే వేరే గౌరవం అవసరం లేదేమో. బాలూ కోసం పుట్టిన ఒక కార్యక్రమం ఆయనతోనే ఆగుతోంది అంటే బాలూ ఏంటో చెప్పకనే చెబుతోందిగా.



మరింత సమాచారం తెలుసుకోండి: