న్యాచురల్ స్టార్ నాని పెళ్లి చేసుకుంటున్నారు. అదేంటి ఇప్పటికే పెళ్లి అయిపోయి ఒక కొడుకు కూడా ఉన్నాడుగా ఈ న్యాచురల్ స్టార్‌కు అని అనుకుంటున్నారు కదూ. పెళ్లి చేసుకోవడం వరకు కరెక్టే కాని ఇది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. నాని ప్రస్తుతం టక్ జగదీష్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేశారు. నానిని పెళ్లి కొడుకు చేస్తున్న ఈ ఫొటో ప్రేక్షకులను తెగ అలరిస్తోంది. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూనే చిత్ర విడుదల తేదీని కూడా చిత్ర బృందం ప్రకటించింది.

ఏప్రిల్ 16వ తేదీన థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో నిన్ను కోరి చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో టక్ జగదీష్ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని సరసన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది టక్ జగదీష్‌ను నిర్మిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌. థమ‌న్ ఈ సినిమాకు బాణీలు అందిస్తుండగా.. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ 13వ తేదీ కావడంతో.. ఏప్రిల్ 16న అంటే ఉగాది కానుకగా టక్ జగదీష్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. నాని 25వ చిత్రంగా వచ్చిన వి చిత్రం డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన వి చిత్రం ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేదనే చెప్పాలి. దీంతో టక్ జగదీష్‌తో ఈసారి మంచి హిట్ ఇవ్వాలన్న కసితో న్యాచురల్ స్టార్ ఉన్నాడు. నానికి టక్ జగదీష్ చిత్రం మంచి హిట్‌ను ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: