ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగుతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరుతో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండడంతో, ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయితే, మరో రెండు సినిమాలు షూటింగుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి రెండూ కూడా రీమేక్ సినిమాలు కావడం విశేషం. ఒకటి మలయాళం మూవీ లూసిఫర్ రీమేక్ కాగా మరొకటి తమిళ మూవీ వేదాళం రీమేక్. మొన్నటి వరకు లూసిఫర్ దర్శకుడి కోసం ఎంతోమందిని పరిశీలించిన తరువాత చివరికి తమిళ దర్శకుడు మోహన్ రాజాను ఫైనల్ చేశారు. ఇక మరో సినిమా వేదాళం కు చిరంజీవి సన్నిహితుడు మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే చాల ఆలస్యం అయినందున ఈ రెండు సినిమాలు కూడా ఇక కాలంలో షూటింగు ను మొదలు పెట్టి పూర్తి చేసే ఆలోచనలో చిత్ర బృందాలు ఉన్నాయని సినీ వర్గాల సమాచారం.

అయితే ఇప్పటికే వేదాళం సినిమా షూటింగును మొదలు పెట్టినట్లు తెలుస్తోంది, అది కూడా కేవలం చిరంజీవి లేని సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆచార్య సినిమా అనంతరం చిరంజీవి కూడా షూటింగులో పాల్గొననున్నారు. అయితే తాజాగా వేదాళం సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి తెలిసింది. మాములుగా వేదాళం సినిమా కోలకతా నేపథ్యంలో జరగనుంది. సోదరితో కలిసి కోల్ కత్తా వెళ్లిన హీరోకు అక్కడి రౌడీ గ్యాంగ్ కుమద్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో వేదాళం రూపొందింది.

రీమేక్ లో మాత్రం లొకేషన్ ను మారుస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ కేరళ నేపథ్యంలో సినిమాను చిత్రీకరించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం  కరోనా తీవ్రత మెల్ల మెల్లగా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనధికారిక సమాచారం. కేరళకు తగినట్లుగానే కథలో కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించే హీరో సోదరి విషయంలో కూడా కొన్ని మార్పులుంటాయని తెలుస్తోంది. చిరంజీవి ఆచార్య సినిమా ను వచ్చే నెలలో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ నెలలోనే ఆచార్య కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: