దేశంలో కరోనా రెండో వేవ్ ధాటికి దేశం అల్లకల్లోలం అవుతోంది. ప్రతి రోజూ లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అంతా కరోనా కోరల్లో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇక గతేడాది తొలి వేవ్ కరోనాతో పోల్చితే సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతోంది. ఈ క్రమంలోనే అనేకమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి నానా అవస్థలు పడుతున్న వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఈ జాబితాలో చేరారు. కరోనా బాధితులను ఆదుకోవడం కోసం కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

అమితాబ్ ఈ విరాళాన్ని ఢిల్లీలోని రాక‌బ్ గంజ్‌లో ఉన్న గురు తేజ్ బ‌హుదూర్ కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి ప్ర‌క‌టించారు. అంతేకాదు విరాళంతో పాటు కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి ఆక్సిజ‌న్ నిల్వ‌ల‌ను స‌రైన స‌మ‌యంలో రప్పించేందుకు అవసరమైన బాధ్యత కూడా తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ విష‌యాన్ని సద‌రు సంర‌క్ష‌ణా కేంద్రం ప్ర‌తినిధి ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేశారు.

‘‘సిక్కులు లెజెండరీ పీపుల్. ఇవి గురు తేజ్ బ‌హుదూర్ కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి రూ.2 కోట్లు డొనేట్ చేసిన సమయంలో అమితాబ్ గారు అన్న మాటలు. ఆక్సిజన్ లేమి కారణంగా ఢిల్లీ బాధపడుతున్నందున అమితాబ్ గారు నాకు కాల్ చేసి ఆక్సిజన్ అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు’’ అని గురు తేజ్ బ‌హుదూర్ కరోనా సంర‌క్ష‌ణా కేంద్రం ప్రతినిధి ట్వీట్‌లో తెలిపారు.

ఇదిలా ఉంటే కరోనా తొలి వేవ్ సందర్భంలో అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్ కరోనా బారిన పడ్డారు. దీంతో వారంతా ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొంది అంతా కోలుకున్నారు. ఈ క్రమంలోనే కరోనా బాధితులకు సాయం చేసేందుకు అమితాబ్ ముందుకు రావడంతో అంతా ఆయనను ప్రశంసిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: