మ‌న భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో రామాయణ మహా కావ్యం ఆధారంగా ఎన్నో సినిమాలు, టీవీ సీరియల్స్, యానిమేటెడ్ వెర్షన్లు వ‌చ్చాయి. ఇంకా వ‌స్తూనే ఉన్నాయి. రామాయ‌ణం అనేది కేవ‌లం ఒక క‌థ కాదు.. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప చిహ్నం. అందుకే నాటి నుంచి నేటి వరకూ ఆ స‌బ్జెక్ట్‌ను కొత్తగా చెప్పాలనే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. ఇటీవ‌ల కాలంలో రామాయ‌ణం ఆధారంగా వ‌చ్చిన చిత్రం `ఆదిపురుష్‌`. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా అల‌రించారు. అయితే వీఎఫ్ఎక్స్‌, సంభాషణల కార‌ణంగా ఈ సినిమా విమ‌ర్శ‌ల‌ను మూట‌గ‌ట్టుకుంది.


ప్ర‌స్తుతం బాలీవుడ్ లో నితేష్ తివారీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా `రామాయణ` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా.. సాయిపల్లవి సీతగా.. యష్ రావణాసురుడిగా న‌టిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను దాదాపు రూ. 4 వేల కోట్లు బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మెగా ప్రాజెక్ట్ పై అంచ‌నాలు తారా స్థాయిలో ఏర్ప‌డ్డాయి. అయితే బాలీవుడ్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ క‌న్నా ముందే ఓ స్టార్ హీరో రామాయణం మొదలుపెట్టి ఆపేసాడ‌న్న సంగ‌తి మీకు తెలుసా? ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు స‌ల్మాన్ ఖాన్‌.


1990ల మధ్యలో సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో ఒక మూవీగా `రామాయణం` తెరపైకి వ‌చ్చింది. ఇందులో సల్మాన్ ఖాన్ రాముడుగా, సోనాలి బేంద్రే సీతగా, పూజా భట్ మరో కీలక పాత్రలో ఎంపిక అయ్యారు. 40 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. రాముడి వేషధారణతో స‌ల్మాన్ ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేయ‌గా.. అప్ప‌ట్లో విశేష‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది. కానీ స‌ల్మాన్ రామాయ‌ణం మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.  


సినిమా షూటింగ్ సమయంలో డైరెక్ట‌ర్ సోహైల్ ఖాన్, పూజా భట్ మ‌ధ్య‌ ప్రేమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ కు తెలియ‌డంతో.. ఆయ‌న సోహైల్ - పూజా రిలేష‌న్ పై తీవ్రంగా స్పందించారు. ఇంట్లో గొడ‌వ‌లు కూడా జ‌రిగాయి. దాంతో పూజా భ‌ట్ సినిమా నుంచి తప్పుకుంది. ఆ త‌ర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు సల్మాన్ రామాయణం మధ్యలోనే ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: