కన్నడ సినిమా ‘మహావతార్ నరసింహ’ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ లో హాట్ టాపిక్ గా మారింది. విడుదల సమయంలో పెద్దగా హంగామా లేకపోయినా, క్రమంగా నోటా నోటి ప్రచారంతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే సమయంలో వరుసగా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ‘మహావతార్ నరసింహ’ దూకుడుకు బ్రేకుల్లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ జూలై 24న విడుదలై మొదటి రోజు బాగానే సందడి చేసినా, రెండో రోజు నుంచే బాక్సాఫీస్ రేస్ లో వెనుకబడింది. గ్రాఫిక్స్ వీక్ అన్న టాక్ గట్టిగా పాకిపోవడంతో కలెక్షన్స్ ఒక్కసారిగా కింద‌కు ప‌డిపోయాయి. జూలై 31న రిలీజ్ అయిన ‘కింగ్డమ్’ కూడా ఓపెనింగ్స్ వ‌చ్చినా త‌ర్వాత కింద‌కు ప‌డిపోయింది.


ఆగస్ట్ 1న తమిళంలో విజయం సాధించిన విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన ‘సార్ మేడమ్’ తెలుగులో ఏ మాత్రం హవా చూపించలేకపోయింది. ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ అయిన ‘వార్ 2’, ‘కూలీ’ చిత్రాలు భారీ అంచనాల మధ్య వచ్చినా… బాక్సాఫీస్ దగ్గర వెన‌క‌ప‌డిపోయాయి. ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో  ‘వార్ 2’ పై టాలీవుడ్ లోనూ గట్టి హైప్ వచ్చింది. కానీ కంటెంట్ బలహీనంగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లకు లాస్ తప్పలేదు. అలాగే రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ లాంటి తారాగణం ఉన్నప్పటికీ లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ ను హిట్ చేయలేకపోయాడు.


ఈ పరిస్థితుల్లో, స్టార్ హీరో లేకుండా, కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘మహావతార్ నరసింహ’ సినిమా రోజురోజుకీ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. యానిమేషన్ లో దేవుడి అవతారం నరసింహ స్వరూపాన్ని చూపించడంతో ప్రేక్షకులలో భక్తి భావన, ఆసక్తి రెండూ కలిసాయి. ఫలితంగా ఈ సినిమా నాలుగో వారంలోకి అడుగుపెట్టినా, పలు నగరాల్లో ఇప్ప‌ట‌కీ 70 % ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది. ఈ సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ రూ. 500 కోట్ల గ్రాస్ ను దాటుతుందని ట్రేడ్ అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: