2025లో టాలీవుడ్‌కు సెప్టెంబర్ నెల ఊరట ఇచ్చిన మాసంగా గుర్తుండిపోతుంది. వరుస ఫ్లాపుల తర్వాత ‘లిటిల్ హార్ట్స్’, ‘మిరాయ్’, ‘కిష్కింధపురి’ విజయం బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి పోశాయి. తర్వాత పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ ‘ఓజీ’ వ‌చ్చి థియేట‌ర్ల ద‌గ్గ‌ర మళ్లీ జన సందడిని తెచ్చింది. అలా చూస్తే సెప్టెంబర్ టాలీవుడ్ క్యాలెండర్లో హిట్‌లకు నిలయంగా మారింది. ఇప్పుడు బంతి అక్టోబరు కోర్టులోకి వచ్చేసింది. అక్టోబరు మొదటిరోజులే టాలీవుడ్‌కు శుభారంభం అయ్యాయి. దసరా సెలవులు, పండుగ హంగామా థియేటర్లలో స్పష్టంగా కన్పిస్తోంది. అక్టోబరు 2న విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ ఘన విజయాన్ని అందుకుంటోంది. రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్, స్టోరీ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ వారం బాక్సాఫీస్‌ను ఈ సినిమా ఒక్కటే లీడ్ చేసేలా కనిపిస్తోంది.

అయితే దీని తర్వాత వారం కాస్త సైలెంట్ మోడ్ ఉంటుంది. ‘శశివదనే’ తప్ప పెద్దగా సినిమాలు లేవు. ఎందుకంటే దీపావళి సీజన్ కోసం మేకర్స్ అన్నీ సినిమాలను హోల్డ్ చేస్తున్నారు. దీపావళి సమయంలో మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ పై పటాకులు పేలబోతున్నాయి. నాలుగు మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి – ‘కే ర్యాంప్’, ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’, ‘మిత్రమండలి’. వీటిలో ఒక్కో సినిమాలోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కంటెంట్ ఉందని టాక్ వస్తోంది. సాధారణంగా దీపావళిని టాలీవుడ్‌లో అన్‌సీజన్‌గా భావిస్తారు. కానీ గత కొన్నేళ్లలో ఆ సెంటిమెంట్ బాగా మారిపోయింది. పండగ ఫ్యామిలీ టైమ్ కావడంతో, థియేటర్లకు కూడా బాగానే ఫ్యామిలీలు వస్తున్నారు. అందుకే ఈ సీజన్‌పై నిర్మాతలు గట్టి ఆశలు పెట్టుకున్నారు.

ఇక అక్టోబరు నెలాఖరున మాత్రం బాక్సాఫీస్ మరింత హీటెక్కనుంది. రాజమౌళి టీం ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ఎపిక్’ గా రీ రిలీజ్ చేస్తోంది. ప్రభాస్ అభిమానులకు ఇది మళ్లీ ఒక పండగే. అదే రోజున మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా, అక్టోబరు 31న మాత్రం ఖచ్చితంగా థియేటర్లలోకి రానుంది. అలా చూస్తే అక్టోబరు నెల ‘కాంతార చాప్టర్ 1’తో మొదలై, ‘మాస్ జాతర’తో ముగియబోతోంది. ఈ మధ్యలో దీపావళి సినిమాలు బాక్సాఫీస్‌పై రచ్చ చేస్తే, కనీసం రెండు సూపర్ హిట్స్ వచ్చే అవకాశం పక్కా. నిర్మాతలకు ఊరట ఇచ్చే నెలగా అక్టోబరు నిలిస్తే – టాలీవుడ్ మళ్లీ జోష్ ఎక్కే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: