- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . . 

తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ రెండు కళ్లుగా నిలిచారు. సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపిన నాయకులుగా పేరుపొందారు. ఆ తరువాత కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు వంటి ప్రముఖ హీరోలు వారి లెగసీని కొనసాగించారు. ప్రస్తుతం ఆ బాధ్యతను మెగాస్టార్ చిరంజీవి భుజాలపై మోస్తున్నారు. కానీ ఆ కాలంలో ఎన్టీఆర్ అంటే అందరిలో ఒక గౌరవంతో కూడిన భయం ఉండేది. ఆయన పనిలో ఎప్పుడూ రాజీ పడేవారు కాదు. షూటింగ్ టైమ్ అంటే టైమ్లో ఆలస్యం అనే పదం ఆయన నిబంధనల్లో ఉండేది కాదు.


ఎన్టీఆర్ సరసన నటించడం అంటే హీరోయిన్‌కి అదృష్టం అని భావించేవారు. సావిత్రి, జమున, శారద, వాణిశ్రీ, కృష్ణకుమారి, శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి ఎంతో మంది ప్రముఖ నటి­మణులు ఆయనతో తెర పంచుకున్నారు. ఎన్టీఆర్ ఎంతటి స్టార్ అయినా కూడా తనతో నటించే వారిని ఎల్లప్పుడూ గౌరవంగా, మర్యాదగా చూసేవారు. ఎన్టీఆర్ మితభాషి స్వభావం వల్ల ఎక్కువగా మాట్లాడేవారు కాదు. హీరోయిన్‌లు కూడా ఆయన ముందు చాలా జాగ్రత్తగా ఉండేవారు. అవసరం లేకుండా ఆయన దగ్గరకు వెళ్లే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు.


ఎన్టీఆర్‌కి ఇండస్ట్రీలో “అన్నగారు” అనే పదం ఎంతో గౌరవప్రదమైనది. కాలక్రమేణా ఆ పేరు ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకగా మారింది. అయితే హీరోయిన్‌లు తమ హీరోను “అన్న” అని పిలవడం అరుదు. కానీ ఎన్టీఆర్‌ను “అన్నగారు” అని పిలిచిన ఏకైక హీరోయిన్ వాణిశ్రీ. ఎన్టీఆర్‌పై తనకు ఉన్న గౌరవం కారణంగా ఆమె ఎల్లప్పుడూ ఆయనను ఆ పేరుతోనే సంబోధించేదట. వాణిశ్రీ ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తనకు ఇచ్చిన ప్రశంసను గుర్తుచేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ “ఎన్టీఆర్ గారు సెట్‌లో ఉన్నారంటే అందరు చాలా సైలెంట్‌గా ఉండేవారు. ఒకసారి షూటింగ్ సమయంలో ఆయన నన్ను పిలిపించారు. నేను వెళ్ళి ‘అన్నగారు రమ్మన్నారట’ అని అడిగాను. ఆయన ‘రండి వాణిశ్రీ గారు, కూర్చోండి’ అని ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు అని వాణిశ్రీ తెలిపారు. ఎన్టీఆర్ తన మాటల్లోనే ఒకరి ప్రతిభను పొగడటం చాలా అరుదు. అటువంటి వ్యక్తి నుండి ప్రశంస అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని క్షణమని వాణిశ్రీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: