టాలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్టైనర్లకు కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఇండస్ట్రీలో 100 శాతం సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్న ఆయన, రాజమౌళి తర్వాత హిట్ రేటు విషయంలో టాప్ స్థానంలో నిలిచారు. పదేళ్ల క్రితం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి, తొలి ప్రయత్నంలోనే బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా విజయం ఆయనకు సినీ రంగంలో స్థిరమైన స్థానం ఇచ్చింది. తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన సుప్రీం కూడా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ పేరు మరింత పెరిగింది. ఆపై రవితేజతో చేసిన రాజా ది గ్రేట్ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు. మాస్, కామెడీ మేళవింపుతో ప్రేక్షకులను అలరించారు. తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో తెరకెక్కించిన ఎఫ్2 ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా సంచలన విజయం సాధించింది. సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ఆ సినిమా, అనిల్‌ను “సంక్రాంతి డైరెక్టర్”గా నిలబెట్టింది.


దీని తరువాత మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సూపర్‌స్టార్‌తో చేసిన ఆ చిత్రం ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ తరవాత ఎఫ్3, భగవంత్ కేసరి సినిమాలతో కూడా హిట్స్ అందుకున్నారు. 2025 సంక్రాంతికి వెంకటేష్‌తో చేసిన సంక్రాంతి వస్తున్నాం సినిమా కూడా భారీ విజయం సాధించింది. అలా సంక్రాంతి సీజన్‌లో వరుసగా మూడు సార్లు హిట్స్ కొట్టిన అరుదైన దర్శకుడిగా గుర్తింపు పొందారు అనిల్ రావిపూడి. ఇప్పుడు మరోసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా మీద పెద్ద అంచనాలు ఉన్నాయి. అయితే ఈసారి పోటీ మాత్రం కఠినంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.


సంక్రాంతికి అనగనగా ఒక రాజు, ది రాజా సాబ్ వంటి సినిమాలు కూడా రాబోతున్నాయి. నవీన్ పోలిశెట్టి ప్రోమోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి. అలాగే ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్‌ బజ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో అనిల్ రావిపూడి సినిమా ఎంతలా కనెక్ట్ అవుతుందో చూడాలి. గత రెండు సంక్రాంతుల్లో లాగా ఈసారి కూడా పాజిటివ్ టాక్ రావడం అత్యవసరం. మొత్తానికి, మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో అనిల్ రావిపూడి మరోసారి తన “సంక్రాంతి సక్సెస్ ఫార్ములా”ని కొనసాగిస్తారా లేక కొత్త సవాళ్లను ఎదుర్కొంటారా అన్నది టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: