కొంత కాలంగా సరైన విజయం కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్ కెరీర్‌కు ఇప్పుడు ఒక బ్రేక్ అనేది అత్యవసరం. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురవడం, చేసిన సినిమాలు సరిగ్గా విడుదల కాకపోవడం, కొన్ని నేరుగా ఓటీటీకే పరిమితం కావడంతో... ప్రాణం పోసే ఒక భారీ సక్సెస్ రాజ్ తరుణ్‌కి అత్యవసరంగా కావాలి. ఇలాంటి కీలక తరుణంలో రాజ్ తరుణ్ తన తాజా చిత్రం 'పాంచ్ మినార్‌ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్.. ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది!


'పాంచ్ మినార్' చిత్రం పూర్తిగా ఒక క్రైమ్ కామెడీగా రూపొందినట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. ఈ జానర్‌కు కావాల్సిన కన్ఫ్యూజన్, కామెడీ టైమింగ్, డబ్బు చుట్టూ తిరిగే కథాంశం... లాంటి అన్ని ఎలిమెంట్స్‌ ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. కథానాయకుడు (రాజ్ తరుణ్)కి ఉద్యోగం చేయడం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కానీ, తాను ప్రేమించిన అమ్మాయి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఉద్యోగంలో చేరతాడు. అక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది.ఒక మాఫియా బ్యాచ్‌కి సంబంధించిన భారీ మనీ బ్యాగ్ హీరో చేతికి చిక్కుతుంది. ఆ తర్వాత ఆ డబ్బు కోసం మాఫియా వెంటపడడం, హీరో పారిపోవడం, ఆ క్రమంలో వచ్చే నవ్వుల సునామీ... ఈ కథాంశం మొత్తానికి కీలకం. ఆ డబ్బుతో రాజ్ తరుణ్ ఎలాంటి మలుపులు తిరిగాడు, మాఫియా నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది థియేటర్లో చూడాల్సిందే!



రాజ్ తరుణ్ పాత్రను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. తనకున్న సహజమైన టైమింగ్‌తో ఈ పాత్రలో ఇమిడిపోయాడు. ఇక ఈ క్రైమ్ కామెడీకి అదనపు బలం.. సినిమాలోని ఇతర కీలక నటులే. బ్రహ్మజీ, అజయ్ ఘోష్, సుదర్శన్ లాంటి అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటులు ఈ సినిమాలో ఉన్నారు. ఇలాంటి సినిమాలకు హాస్యం పండితే.. అది ప్రేక్షకులకు పైసా వసూల్ అవుతుంది!ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై రాజ్ తరుణ్ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తేనే.. రాజ్ తరుణ్ కెరీర్ ట్రాక్‌లోకి వస్తుంది. అందుకే నిర్మాతలు రిలీజ్‌కు ముందు ప్రీమియర్స్ వేసి సినిమాపై మరింత హైప్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఈ పాంచ్ మినార్.. రాజ్ తరుణ్ కెరీర్‌కు నిజమైన మలుపు అవుతుందో లేదో చూడాలి!



మరింత సమాచారం తెలుసుకోండి: