రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే బడ్జెట్లు, బిజినెస్ లెక్కలు, వసూళ్లు అన్నీ భారీ స్థాయిలో ఉంటాయి. సాధారణంగా కొంచెం మీడియం బడ్జెట్‌లో తీద్దాం అని మొదలుపెట్టిన సినిమాలు కూడా ప్రభాస్ ఇమేజ్ కారణంగా చివరికి భారీ ప్రాజెక్టులుగా మారిపోతుంటాయి. దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ప్రారంభంలో ఇది మిడ్ రేంజ్ మూవీ అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 400 కోట్లు దాటినట్లు సమాచారం.


మారుతికి అలవాటైన హార్రర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్నప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, విదేశాల్లో చిత్రీకరణ మరియు భారీ స్టార్ కాస్టింగ్ కారణంగా బడ్జెట్ హద్దులు దాటిపోయింది. అయితే ప్రభాస్ సినిమా కావడంతో బిజినెస్‌కు ఎటువంటి ఢోకా లేదు. తాజా సమాచారం ప్రకారం, ‘రాజాసాబ్’ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేస్తోంది. ఆంధ్ర: రూ. 85 కోట్లు , నైజాం: రూ. 70 కోట్లు , రాయలసీమ (సీడెడ్) రూ. 40 కోట్లు


ఈ లెక్కలు వినడానికి బాగానే ఉన్నా, గ్రౌండ్ లెవల్‌లో మాత్రం కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నైజాం (తెలంగాణ) మార్కెట్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు రిస్కీగా మారింది. ఇటీవల ‘ఓజీ’, ‘అఖండ 2’ వంటి పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపుపై కోర్టుల్లో కేసులు పడటం, ప్రభుత్వం కూడా ఇకపై అదనపు రేట్లు ఉండవని సంకేతాలివ్వడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి స్వయంగా రేట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోల విషయంలోనూ ఆంక్షలు ఉంటాయని తెలపడంతో, రూ. 70 కోట్ల షేర్ రాబట్టడం ‘రాజాసాబ్’కు కత్తిమీద సాము లాంటిదే. అంతిమంగా ఇది ప్ర‌భాస్ సినిమాకు ఇబ్బందిగా మార‌నుంది.


సంక్రాంతి బరిలో ‘మన శంకర వరప్రసాద్’ వంటి ఇతర పెద్ద సినిమాలు కూడా ఉండటంతో థియేటర్ల విభజన, ప్రేక్షకుల ఆప్షన్లు మారుతుంటాయి. ఏపీలో బెనిఫిట్ షోలు, రేట్ల పెంపుకు సానుకూలత ఉన్నా, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం నుంచి జీవో రాకపోతే డిస్ట్రిబ్యూటర్లు తమ అగ్రిమెంట్లను రివైజ్ (మార్పు) చేయాలని కోరే అవకాశం ఉంది. భారీ పోటీ మధ్య ‘రాజాసాబ్’ ఈ రికార్డు స్థాయి టార్గెట్‌ను ఎలా అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: