

తాత్కాలిక ప్రాతిపదికన విదేశాల్లో పనిచేస్తున్న వారు తమ వృత్తుల్లో ఎదుర్కొంటున్న నైపుణ్య లోపాలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. మన దేశ యువత వృత్తి, సాంకేతిక విద్యలో అత్యున్నత ప్రమాణాలను సాధించేందుకు వారి అండదండలు అవసరమన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్వచ్ఛభారత్ తదితర కార్యక్రమాలకూ ఇతోధికంగా చేయూతనివ్వాలని కోరారు. అంతకుముందు 2014-15లో విదేశాల్లో ప్రధాని మోదీ భారత విదేశాంగ విధానంపై చేసిన ప్రసంగాలున్న పుస్తకాలను రాష్ట్రపతి ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన 30మంది ప్రవాస భారతీయులకు ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. తొలి పురస్కారాన్ని పోర్చుగల్ ప్రధాని డాక్టర్ అంటోనియో కోస్తాకు అందించారు.