ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కేసీఆర్ ఫిలింసిటీకి వచ్చి గంటల తరబడి గడిపారు. రామోజీ గొప్పదనాన్ని స్వయంగా పొగిడారు. ఆ తర్వాత రామోజీ స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం సచివాలయానికి కూడా వచ్చారు. ఇక మొన్నటికి మొన్న కేసీఆర్ యాగానికి రామోజీ మొదటిరోజే స్వయంగా హాజరయ్యారు. 

ఇప్పటికే ఈనాడు, ఈటీవీ, రామోజీ ఫిలింసిటీ వంటి ప్రాజెక్టులతో తన ప్రతిష్టను ఆకాశమంత విస్తరించుకున్న రామోజీరావు.. మరో అద్భుత ప్రాజెక్టు ఓం సిటీతో మరింత పెంచుకోనున్నారు. దేశంలోని మొత్తం 108 ఆలయాల నమూనాలను ఒకే చోట సాక్షాత్కరింపజేసే అద్భుతమైన ప్రాజెక్టు ఇది. తెలంగాణకు మరో మణిహారం కాగలదని స్వయంగా కేసీఆరే కితాబిచ్చారు.

ఓంసిటీ కోసం అన్నివిధాలా సహాయపడతామని కూడా కేసీఆర్ రామోజీ ఫిలింసిటీని సందర్శించిన సమయంలో చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే పనిలో ఉన్నారు కేసీఆర్. ఓం సిటీ కోసం 505 ఎకరాల భూమి సేకరించి ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు సిద్దమైనట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అదికారులు భూమిని గుర్తించి సర్కారుకు ప్రతిపాదనలు పంపారట.

ఓం సిటీ కోసం మొత్తం 2వేల ఎకరాలు కావాలని రామోజీ అడిగారట. అంత భూమి ఒకే చోట ఇవ్వడం సాధ్యంకాదు కాబట్టి ప్రస్తుతానికి హయత్ నగర్ మండలం కోహెడ, అబ్దుల్లాపూర్ గ్రామాల్లో ఈ భూమి గుర్తించారట. ఇక ఈ ఫైలుపై సర్కారు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందట. అన్నీ సకాలంలో పూర్తయితే త్వరలోనే తెలంగాణలో అద్భుతమైన ఆధ్యాత్మక నగరం కొలువుతీరడం ఖాయమట. 


మరింత సమాచారం తెలుసుకోండి: