ఓ ట్రెండ్ క్రియేట్ చేసి తెలుగు గ‌డ్డ‌పై త‌న సత్తా ఏంటో చూపించింది ఇంగ్లీష్ దిన‌ ప‌త్రిక ‘డెక్కన్ క్రానికల్’. ప‌త్రిక రంగంలో టాప్ ప్లేస్‌కు వెళ్లిన‌ ఈ ప‌త్రికకు ఇప్పుడు క‌ష్టాల్లో కూరుకుపోయిన‌ట్టు తెలుస్తోంది. డీసీ అర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోయిన‌ట్టు చెబుతున్నారు.


సౌతిండియాలోనే అత్య‌ధిక స‌ర్క్యూలేష‌న్ ఉన్న ఇంగ్లీష్ డైలీగా ఉన్న డీసీకి మంచి పేరుంది. ఆ సక్సెస్ కి తగ్గట్టే అందులో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు ఉండేవి. ఒక్కో సందర్భంలో ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చిన సంద‌ర్భాలున్నాయి. అయితే రోజులు ఎప్పుడూ ఒకే విధంగా వుండవు కదా. ఇప్పుడు డెక్కన్ క్రానికల్ ఓ దినపత్రికగా ఎక్కడా వెనుకపడలేదు. అయితే దాన్ని నిర్వహిస్తున్న యాజమాన్యమే ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుందని టాక్. దీంతో కిందటి నెలలో జీతాలు 17 తారీఖు తర్వాత పడ్డాయట. కానీ జూన్ నెలకు సంబంధించిన వేతనం ఇంతవరకూ రాలేదట‌. దీంతో ఉద్యోగులు ఒకింత ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ 2013 నాడు విడుదల చేసిన బ్యాంకు ఋణం ఎగవేతదారుల లిస్టులో బ్యాంకులకు రూ. 700 కోట్ల రూపాయలు అప్పు ఉన్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కూడా ఉంది. ఆస్తులకు మించి అప్పులు తెచ్చుకోవటం.. ఒకే డాక్యుమెంట్లను పలు బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకోవటం వంటి ఎన్నో కేసులు డీసీ యాజమాన్యం ఎదుర్కొంటోంది.


ఇటీవ‌ల‌ శ్రే ఇన్ ఫ్రా తనకు రావాల్సిన అప్పులకుగాను డెక్కన్ క్రానికల్ యాజమాన్య హక్కులను దక్కించుకునే ప్రయత్నం చేసింది. బోర్డులో తన సభ్యులను నియమించింది. ప్రస్తుతం పత్రిక బాగానే నడుస్తున్నా…ప్రకటనలు కూడా బాగానే వస్తున్నా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి సంస్థ రావటంతో తమ భవిష్యత్ ఏమిటో అన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. నిజానికి డెక్కన్ క్రానికల్ కు మంచి బ్రాండింగ్ ఉన్నా.. ఎవ‌రికైనా అప్ప‌గించాల‌న్నా.. కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. దీంతో అటు యాజ‌మాన్యం, ఇటు సిబ్బంది ఏమీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: