తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు వైసిపి నేత, పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ టిడిపి ఎంపి కేశినేని నానికి లీగల్ నోటీసిచ్చారు. ఎన్నికల సందర్భంగా తనను కేశినేని నేరస్తుడని ఆరోపించారంటూ పొట్లూరి మండిపడుతున్నారు. అందుకే తాను ఎంపికి లీగల్ నోటీసులు ఇచ్చినట్లు పిట్లూరి చెప్పారు.

 

రాజకీయాలన్నాక అందులోను ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవటం మామూలే. రాజకీయ నేతలు చేసుకునే ఆరోపణలకు సాధారణంగా ఆధారాలుండవన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే తనపై వచ్చే ఆరోపణల విషయంలో ఒక్కోరు ఒక్కో విధంగా స్పందిస్తుంటారు. ఇందులో భాగంగానే పివిపి కేశినేనికి లీగల్ నోటీసులు పంపారు.

 

తనపై ఎక్కడ కూడా కేసులు లేవని అలాంటిది తనపై టిడిపి ఎంపి బురదచల్లాలని చూడటం తనకు బాధ కలిగించిందని పివిపి చెప్పారు. పనామా పేపర్లలో తన పేరుందని కేశినేని చేసిన ఆరోపణలు నిరూపించకపోతే తాను లీగల్ నోటీసును ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేశారు.

 

కేశినేనికి తొందరలోనే లీగల్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు గతంలోనే పివిపి చెప్పారు. ఇపుడు అన్నంత పనీ చేశారు. అలాగే కేశినేని ఆరోపణలను ప్రసారం చేసిన రెండు, మూడు టివి ఛానళ్ళకు కూడా నోటీసులు అందించనున్నట్లు చెప్పారు. తనపై ఎంపి చేసిన ఆరోపణలను నిర్ధారించుకోకుండా ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పైగా మూడు ఛానళ్ళు ఎంపి ఆరోపణలను పట్టుకుని తనపై ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం చేసినట్లు పివిపి మండిపోతున్నారు. మరి లీగల్ బ్యాటిల్ ఎక్కడకు దారి తీస్తుందో చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: