నిర్భయ దోషులకు ఉరిశిక్ష కొద్ది సేపటి క్రితం అమలు చేశారు. ధిల్లీ లోని తీహార్ జైలు నెంబరు 3 లో నిర్భయ కేసులో దోషులు నలుగురిని ఉదయం సరిగ్గా 5 : 30 గంటలకు ఉరితీశారు. 2012 డిసెంబ‌ర్ 16న దేశ రాజ‌ధాని ఢిల్లీలో రాత్రి వేళ క‌దులుతున్న బ‌స్సులోనే ఓ అమ్మాయిపై ఆరుగురు మృగాళ్లు అత్యంత పాశ‌వికంగా లైంగీక దాడి చేశారు.  అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేష్ సింగ్ అనే నలుగురు వ్యక్తులు కదులుతున్న బస్సులో ఒక అమ్మాయిని దారుణంగా చేరచి అనంతరం ఆమెను హత్య చేశారు.



బాధితురాలు సింగ‌పూర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఈ కేసులో నిందితులు తప్పించుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు. ఎన్నో డ్రామాలు ఆడారు. వీరికి శిక్ష ప‌డేందుకు నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ఏళ్ల‌కు ఏళ్లుగా పోరాడుతున్నారు. ఒకానొక ద‌శ‌లో అస‌లు ఆమె పోరాటం గెలుస్తుందా ? అన్న సందేహాలు సైతం క‌లిగాయి. ఎన్నో సార్లు ఆమె నాకు భార‌త న్యాయ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం లేద‌ని కూడా ప్ర‌క‌టించారు. త‌న కుమార్తెకు జ‌రిగిన అన్యాయం దేశం మొత్తానికి తెలిసినా కూడా వాళ్ల‌కు శిక్ష ప‌డ‌ట్లేద‌ని ఎంతో వేద‌న చెందారు.



అయితే ఆమె చేసిన పోరాటం ఎట్ట‌కేల‌కు ఫ‌లించింది. చివరకు న్యాయం గెలిచింది. దోషులుగా తేలిన నిందితులకు కోర్టు విధించిన మరణ శిక్షను తీహార్ జైలు అధికారులు ఈ ఉదయం అమలు చేశారు. నిర్భయ తల్లి ఈ కిరాతకులు నలుగురినీ ఉరి తీయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏదేమైనా నిర్భ‌య త‌ల్లి ఇన్నేళ్లుగా చేసిన పోరాటం ఎంతో మంది మ‌హిళ‌ల్లో స్ఫూర్తి నింపింది అన‌డంలో సందేహం లేదు. దేశం మొత్తం ఆమె పోరాటానికి స‌లాం చేస్తోంది అన‌డంలో సందేహం లేదు. ఇలాంటి విష‌యాల్లోనే కాదు ఏ విష‌యంలో అయినా భార‌త మ‌హిళా శ‌క్తిని ఆమె చాటి చెప్పిన‌ట్ల‌య్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: