క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో దేశ‌వ్యాప్తంగా తెర‌మీద‌కు వ‌చ్చిన అంశం త‌బ్లిగ్ ఈ జ‌మాత్‌. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తబ్లిగి జమాత్‌ పేరు ప్రపంచానికి తెలిసివచ్చింది. ఢిల్లీ సమీపంలోని నిజాముద్దీన్‌లో తబ్లిగి జమాత్‌ మసీదులో జ‌రిగిన స‌మావేశాలు, అనంత‌రం క‌రోనా విస్త‌ర‌ణ క‌ల‌క‌లం సృష్టించింది. అయితే, తాజాగా వీరి విష‌యంలో తాజాగా కీల‌క అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. కరోనా ముప్పుపై అధికారుల ఆదేశాలను తబ్లిగీ జమాత్‌ కార్యక్రమ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగానే పెడచెవిన పెట్టారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపడుతున్నారని, సీబీఐ విచారణ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

 

త‌బ్లిగ్ జ‌మాత్‌‌, ఆనంద్‌ విహార్‌ ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రియా పండిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సంద‌ర్భంగా కేంద్రం అఫిడవిట్ దాఖ‌లు చేసింది. లాక్‌డౌన్‌, భౌతిక నిబంధనలను ధిక్కరించి, మత కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తబ్లిగీ జమాత్‌ అధిపతి మౌలానా మహమ్మద్‌ సయ్యద్‌ తన అనుచరులకు సూచిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సయ్యద్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఢిల్లీ పోలీసులు చేపట్టిన చర్యలను అఫిడవిట్‌లో ప్రస్తావించింది. నిర్దేశిత గడువులోగా ట్రయల్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపింది. తబ్లిగీ జమాత్‌ కేసుతో పాటు లాక్‌డౌన్‌ అనంతరం ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ బస్‌ టెర్మినల్‌ వద్దకు పెద్ద ఎత్తున వలస కార్మికులు చేరుకున్న ఘటనపైనా ఢిల్లీ పోలీసులు రోజువారీ దర్యాప్తు చేపడుతున్నారని వివరించింది.  కాగా, తబ్లిగి జమాత్‌కు వచ్చిన విదేశీయుల కారణంగానే భారత్లో కరోనా కేసులు వేగంగా విస్తరించిందన్న ఆరోపణలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: