కేరళ విమాన ప్రమాదంలో 20మంది చనిపోయారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చిన విమానం భారీ వర్షం కారణంగా రన్‌వే పైనుంచి జారిపోయి రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో 191 మంది ఉండగా, ఇద్దరు పైలెట్లతో సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 39మంది పరిస్థితి విషమంగా ఉంది. వందమందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై డీజీసీఏ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. అటు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.

కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్‌లో అనుకోని దుర్ఘటన. శుక్రవారం రాత్రి 7గంటల 40 నిమిషాలకు కేరళలోని కోజికోడ్‌లో కారిపూర్ విమానాశ్రయంలో ఏయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. భారీ వర్షంతో ... రన్‌వేపై నీరు చేరడంతో విమానం జారిపోయింది.  రన్‌ వే చిన్నదిగా ఉండటం.. విమానాశ్రయం కొండపై ఉండటంతో... విమానం 200అడుగుల లోయలోకి పడి ముక్కలైంది. అయితే విమానానికి మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ప్రమాదంలో విమాన పైలెట్లిద్దరూ చనిపోయారు. పైలెట్ దీపక్ వసంత్ సాఠేతో పాటు కోపైలెట్‌ కూడా మృతి చెందాడు. మరో ఇద్దరు విమాన సిబ్బంది కూడా చనిపోయినట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు... విమానంలో .. మొత్తం 191 మంది ఉన్నారు. ఇందులో 174 మంది ప్రయాణికులు కాగా వీరితోపాటు 10 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు పైలెట్లతో కలుపుకొని ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు.

ఎయిర్ ఇండియాకు చెందిన IX-1344 విమానం దుబాయ్ నుంచి కోజికోడ్‌కు వచ్చింది. భారీ వర్షం వల్ల పైలెట్‌కు ల్యాండింగ్ కష్టమైంది. అప్పటికే ఒకసారి విమానం ల్యాండింగ్‌కు పైలెట్‌ ప్రయత్నించి విఫలమయ్యాడు. గాల్లోనే విమానాన్ని వెనక్కి తిప్పి వచ్చి.. మరోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించాడని.. ఫ్లైట్ రాడార్ 24 వెబ్‌సైట్ మ్యాప్‌లో చూస్తే అర్థమవుతుంది.

ప్రమాదం జరగ్గానే ఫైర్ ఫైటర్స్, అంబులెన్స్‌లు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా పాల్గొన్నాయి. టార్చ్‌లు లేకపోవడం, వర్షం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. అయితే అర్థరాత్రికల్లా... విమానంలోని వారందరిని బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో తీవ్రగాయాలైన వారు 20 మందివరకు ఉన్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని కోజికోడ్‌లోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో, సమీప ఆస్పత్రుల్లో చేర్పించామని కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

ప్రమాదం జరగ్గానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరాతీశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. స్థానిక యంత్రాంగం చేపడుతున్న సహాయక చర్యల గురించి ప్రధానికి విజయన్ వివరించారు. ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్  విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్‌లో పౌర విమానయాన శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి డీజీసిఏ డైరక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారులు హాజరయ్యారు. ప్రమాదం జరగడానికి కారణాలతో పాటు, సహాయక చర్యలపై చర్చించారు. ప్రమాదం జరగడానికి ముందు ల్యాండింగ్ సమయంలో విమానం వేగం ఎక్కువగా ఉందని అధికారులు తేల్చారు. ఇప్పటికే డీజీసిఏ సమగ్ర దర్యాప్తు చేపట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి: