కేసీఆర్ కుమార్తె కవిత ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడంతో.. అందరి దృష్టీ అమెను మంత్రి వర్గంలోకి తీసుకుంటారా అనే విషయంపై ఫోకస్ అయింది. ఒకవేళ కవితను మంత్రి వర్గంలోకి తీసుకుంటే, ఎవరికి చెక్ పెడతారు, ఏ పోర్ట్ ఫోలియా ఇస్తారు? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు కవిత. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందిన గడ్డపైనే గెలుపు జెండా ఎగరేశారు. సీఎం కేసీఆర్‌ కుమార్తె కావడంతో ఈ ఎన్నికను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 823ఓట్లకు గాను 728 ఓట్లను కైవసం చేసుకుని విపక్షాలను చిత్తు చేశారు కవిత.

తాజా ఎన్నికతో తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు కవిత. ఈ ఎన్నికపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేవలం 15 నెలల పదవీకాలం ఉన్న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ స్థానానికి కవితను ఎంపిక చేయడం వెనుక వ్యూహం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పూర్థిస్థాయి మంత్రివర్గం కొలువుతీరి ఉన్న నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవిని ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మంత్రివర్గంలో కేవలం 17 మందికే అవకాశం ఉంది. ఈ కోటా ఇప్పటికే పూర్తయింది. ఒకవేళ కవితను కేబినెట్‌లోకి తీసుకోవాలంటే ఎవరో ఒకరని తప్పించాల్సిందే. ఆ సాహసం ఎవరు చేస్తారు..? సీఎం ఎవరిపై వేటు వేస్తారు? అనేది తెలియాల్సి ఉంది.

సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు కవిత కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఏ ఒక్కరిని తప్పించినా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోక తప్పదు. అయితే మంత్రివర్గంలో అవకాశం లేకపోతే కేబినెట్‌ హోదా కల్పించి వేరే ఇతర బాధ్యతలు అప్పగిస్తారనే చర్చకూడా జరుగుతోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది కవిత మంత్రివర్గంలో చేరడం ఖాయమని వ్యాఖ్యానించడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: