మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారా..? సుశాంత్‌ కేసు నుంచి బీహార్‌ ఎన్నికల దాకా బీజేపీ తో యుద్ధం ప్రకటించారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉద్ధవ్‌ ప్రసంగాలు, ఆయన చేతలు బీజేపీతో దేనికైనా రెడీ అనే సంకేతాలిస్తున్నాయి‌. మరోవైపు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా కంగనాతో పేచీలు పెట్టుకుంటూ తన స్థాయిని తగ్గించుకుంటున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

ఉద్దవ్‌ థాక్రే.. ఇటీవల దేశంలో జరుగుతున్న పరిణామాలతో ఈ పేరు మరింతగా వినిపిస్తోంది. చీటికి మాటికి కేంద్రంతో రుసరుసలాడుతున్నారు మహా సీఎం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  అధికారంలోకి వస్తే ప్రతి బీహారీకి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది బీజేపీ. దీనిపై ఉద్ధవ్ థాక్రే ఫైర్ అయ్యారు.  మరి మిగిలిన రాష్ట్రాల వారు ఏంటి? బంగ్లాదేశ్, కజకిస్తాన్ నుంచి వచ్చారా? అలా మాట్లాడే వారు తమను చూసి తాము సిగ్గుపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఉద్ధవ్‌. బీజేపీవాళ్లు దేశాన్ని విభజిస్తున్నారని, మహారాష్ట్రలో వారి ఆటలు సాగవని వార్నింగ్‌ ఇచ్చారు.

ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి దాంట్లో కేంద్రంతో ఢీ అంటున్నారు ఉద్ధవ్‌. ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు.  ఎవరికైనా సరే దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని సవాల్ విసిరారు.  గంటలు, ప్లేట్లు మోగించడం  మీ హిందుత్వం అని, తమది అలాంటి హిందుత్వం కాదని ఉద్దవ్ బీజేపీపై కౌంటర్‌ల మీద కౌంటర్‌లు వేశారు. సుశాంత్‌ కేసు విషయంలో కూడా బీజేపీ సీబీఐని నియమించడంపై ఫైరయ్యారు ఉద్ధవ్‌. ముంబై పోలీసుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ప్రయత్నాల ఎవరూ చేసినా ఊరుకోమంటూ డైరెక్ట్‌గా బీజేపీపై యుద్ధాన్ని ప్రకటించారు.

ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చారంటే అది ప్రధానికే అవమానమని, పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఇప్పటికి ఆరేళ్లయినా అతీగతీ లేదని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు మహారాష్ట్రలో కంగనా వర్సెస్ ఉద్ధవ్‌గా పరిస్థితి మారింది. ఇప్పటికే కంగనా బిల్డింగ్‌ కూల్చడం దగ్గర నుంచి.. ఆమెపై కేసులు పెట్టే వరుకు వెళ్లారు శివసేన చీఫ్‌. సొంత రాష్ట్రంలో తిండికి గతిలేనివారు ముంబైలో డబ్బు సంపాదించుకుని, నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారని కంగనాపై ఉద్ధవ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయ్‌. ముంబై పీవోకే అయినప్పుడు..సొంతరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కు పోవాలంటూ సూచించారు.

కంగనాకు కేంద్రం సెక్యూరిటీ కల్పించడంపై కూడా శివసేన మండిపడింది. బీజేపీ కళ్లకు సెలబ్రిటీలు మాత్రమే కన్పిస్తారా..? సామాన్యులు కనబడరా అంటూ మండిపడ్డారు శివసేన నాయకులు. మొత్తానికి ఉద్ధవ్‌ స్పీడ్‌ పెంచినట్లు అర్ధమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: