తిరుగులేని మెజారిటీతో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో అధికారం అప్పగించిన ఆశేష భారతావనికి మోడీ క్రమంగా రుణం తీర్చుకుంటున్నాడు. ప్రతిపక్షం కూడా సరిగా ఏర్పడే అవకాశం లేకుండా చేసినందుకు తగిన ప్రతిఫలం అందిస్తున్నాడు. ఏం చేసినా.. పెద్దగా అడిగే దిక్కూ మొక్కూ లేకపోవడంతో తనదైన స్టైల్లో జనానికి వాతలు పెట్టడం మొదలుపెట్టాడు. మొన్నటికి మొన్న రైల్వే ప్రయాణ చార్జీలు అమాంతం 14 శాతం వరకూ పెంచేసిన భారత ఆశాకిరణం ఇప్పుడు వంటింటిపై దృష్టి సారించాడు. అయితే ఇల్లాళ్లను ఒకేసారి ఇబ్బంది పెడితే బావుండదనుకున్నాడో... వాయిదాల పద్దతి గృహిణులకు అలవాటే కాబట్టి వడ్డింపు కూడా అదే తరహాలో ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. నెల నెలా క్రమం తప్పకుండా కొంత పెంచుకుంటూ పోతే.. ఏదో ఒకనాటికి సబ్సిడీల భారం తీరిపోతుందని కదా అని కనీవినీ ఎరుగని అద్భుతమైన ఐడియాతో వడ్డనకు ప్రణాళికలు సిద్ధం చేశాడు. గ్యాస్ సిలిండర్ పై నెల నెలా 5 రూపాయలు, కిరోసిన్ పై నెల నెలా అర్థ రూపాయి పెంచాలన్నది తాజా ఆలోచన. ఇలా చేయడం ద్వారా ఈ రెండింటి ద్వారా సర్కారుపై పడుతున్న 80వేల కోట్లరూపాయల సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవచ్చని.. అప్పుడిక.. జనానికి పనికొచ్చే పనులు అర్జంటుగా మొదలెట్టొచ్చని మోడీసారు ఆలోచిస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ముందస్తు హెచ్చరికలు పంపితే ఏంటో అనుకున్నాం కానీ.. మరీ ఇంతలా వాతలు పెడతాడని అనుకోలేదని జనం తాపీగా వాపోతున్నారిప్పుడు. అబ్బే.. ఇవన్నీ యూపీఏ తీసుకున్న నిర్ణయాలే తప్ప.. మేం తీసుకున్నవి కాదంటూ వెంకయ్య వంటి నేతలు మోడీసారును వెనకేసుకొస్తున్నారు. మరి యూపీఏ తీసుకున్న నిర్ణయాలు బాగాలేవనే కదా.. తమరిని గెలిపించారు.. అంటే.. మాత్రం సరిగ్గా సమాధానం రాదు. కొన్నాళ్లు నన్ను జనం తిట్టుకున్నా ఫరవాలేదని ముందుగానే నరేంద్ర మోడీగారు సెలవిచ్చినందువల్ల.. ఆయన ముందుగానే మైండ్ లో బ్లైండ్ గా ఫిక్సయిపోయి ఉంటారు.. ఇంకా మరి ఇలాంటి వాతలు ఇంకెన్ని చూడాలో.. సేవకుడి రాజ్యం అంటే బహుశా ఇదే కాబోలు.. అనుకుంటూ నిట్టూరుస్తున్నారు జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: