అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షకు గురైన అన్నా డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, తన అధికార దర్పాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారన్న అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జయలలితకు శిక్ష ఖరారు చేస్తూ జాన్ మైఖేల్ డికున్హా విడుదల చేసిన తీర్పు ప్రతులు ఈ విషయాలను వెల్లడి చేస్తున్నాయి. అధికారంలో ఉండగా, తన ఆస్తుల పెంపుదలకు అధికారులను ఎలా ఉపయోగించుకున్నారన్న విషయం తాజాగా వెలుగు చూసింది. 1994లో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న రాజగోపాల్ అనే ప్రభుత్వాధికారిని తన ఇంటికి పిలిపించుకున్న జయలలిత, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ స్థలాలు కొనుగోలు చేసేందుకు అవకాశముందో వివరించడంతో పాటు దగ్గరుండి మరీ సదరు కార్యక్రమాలను చక్కబెట్టాలని ఆదేశాలు జారీ చేశారట. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో తన విధులకు విరుద్ధమే అయినా, ఆయన నోరు మెదపకుండా సహకరించారట. తన తరఫున దత్తపుత్రుడు సుధాకరన్ తోడుంటారన్న జయలలిత ఆజ్ఞలతో రాజగోపాల్, నిత్యం సుధాకరన్ తో టచ్ లో ఉండాల్సి వచ్చేదట. ఇలా దాదాపుగా 3 వేల ఎకరాల భూమిని రాజగోపాల్ సలహాతోనే జయలలిత కొనుగోలు చేశారని డికున్హా నిర్ధారించారు. ఇక చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ శివ సహకారంతో వెయ్యి ఎకరాల భూమిని తిరునల్వేలి జిల్లాలో రాజగోపాల్, జయలలిత ఆస్తుల చిట్టాలో కలిపారట. ఈ క్రమంలో పలుమార్లు ఆయన నిబంధనలకు నీళ్ళొదిలారని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: