న‌రేంద్ర‌మోడీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వానికి విశాఖప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం కార్మికులు, ఉద్యోగులు త‌మ‌దైన శైలిలో స‌మాధానం చెప్పారు. సంస్థ  ప్ర‌యివేటీక‌ర‌ణ విష‌యంలో కేంద్రం వైఖ‌రిపై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విశాఖ కేంద్రంగా న‌డుస్తోన్న ఉద్య‌మానికి దేశం నలుమూల‌ల నుంచి మ‌ద్ద‌తు వ‌స్తోంది. అయినా కేంద్రం మాత్రం తాను తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోను అమ్మేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప్ర‌భుత్వానికి విశాఖ ఉక్కు లాభాల‌ షాకిచ్చింది. దీంతో కేంద్రం ఏం చేస్తుందా? అంటూ అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది.

రూ.3300 కోట్ల ఆదాయం
జపాన్‌లోని ఉద్యోగులు, కార్మికులు త‌మ నిర‌స‌న యాజ‌మాన్యానికి తెలియ‌జేయాలంటే ఎక్కువ ప‌నిగంట‌లు ప‌నిచేస్తారు. తాజాగా అదే సూత్రాన్ని విశాఖ ఉద్యోగులు పాటించారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారం చరిత్రలో ఇప్పటివరకు ఎన్న‌డూ లేనంత‌భారీ టర్నోవర్ న‌మోదైంది. ఓవైపు 50 రోజులుగా షిప్టుల వారీ రిలే నిరాహార దీక్షలు... మరోవైపు ప్ర‌యివేటీకరణ ఆపాలంటే సంస్థను లాభాల బాట పట్టించాలన్న పట్టుదల... దీంతో.. మార్చి నెలలో 7.11లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తిని సాధించారు. రూ.3300 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు. ఉక్కుక‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ విష‌యంలో తాను ప‌ట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోన్న న‌రేంద్ర‌మోడీ స‌ర్కారుకు విశాఖ ఉక్కు కార్మికులు వీపు విమానం మోత మోగేలా లాభాల‌బాట ప‌ట్టించార‌ని తెలుగువారంతా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విష‌యంలో ఏమీ మాట్లాడ‌కుండా ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా కంపెనీ లాభాలు శ‌రాఘాతంలాంటివంటున్నారు.

చ‌రిత్ర‌లో తొలిసారిగా అత్య‌ధిక ఆదాయం
విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక ఆదాయాన్ని సాధించినట్లు సంస్థ సీఎండీ పి.కె.ర‌థ్ వెల్లడించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగుల్ని, కార్మికుల్ని ఆయ‌న అభినందించారు. ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులు. కానీ, ఈ ఏడాది అంతకు మించి ఉత్పత్తి జరిగింది. అందులో 45 లక్షల టన్నులు విక్రయించామ‌ని ర‌థ్ తెలిపారు. విదేశాలకు 13 లక్షల టన్నులు ఎగుమతి చేశామని, ఇది అంతకు ముందు కంటే 261 శాతం అధికమని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాలకు రూ.10 కోట్లు వెచ్చించామన్నారు. నష్టాలను కార‌ణంగా చూపించి బంగారంలాంటి క‌ర్మాగారాన్ని త‌మ సొంత‌వారికి క‌ట్ట‌బెట్టాల‌నుకుంటున్న‌వేళ లాభాల బాటలో నడిచేలా సంస్థను తీసుకొచ్చిన కార్మికుల తీరుపై అంద‌రిలో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌ర‌కంగా ఈ ఫ‌లితాలు మోడీ స‌ర్కార్‌కు షాక్ లాంటివ‌ని ఆర్థిక‌వేత్త‌లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: