తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలపై చాలామంది చాలా రకాల ఆశలు పెట్టుకున్నారు. తొలి దశలో మంత్రి పదవి ఆశించి భంగపడిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇందులో ఒకరు. ఆమధ్య పార్టీతో అంటీ ముట్టనట్టు ఉంటూ, సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసిన ఆనం, మెల్లిగా జగన్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో సొంత నియోజకవర్గం వెంకటగిరిలో పూర్తి స్థాయిలో చక్రం తిప్పారు. ఇప్పుడు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో మరోసారి వెంకటగిరి నియోజకవర్గాన్ని టాక్ ఆఫ్ ది ఎలక్షన్ గా మార్చేశారు ఆనం రామనారాయణ రెడ్డి.

తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల ప్రకటన నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకంటే వెంకటగిరిలో ఫలితాలు వైసీపీకి పూర్తి ఆశాజనకంగా ఉన్నాయి. వాస్తవానికి తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే అన్ని చోట్లా పార్టీకి పూర్తి అనుకూల పరిస్థితి లేదనే విషయం వాస్తవం. గూడూరు లాంటి కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ మెజార్టీ తగ్గుతూ వస్తోంది.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి భారీ మెజార్టీ తెచ్చేందుకు నేతలంతా కష్టపడ్డారు. అయితే రెండో విడత మంత్రి వర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకున్న ఆనం లాంటి నేతలు మాత్రం సొంత లాభం చూసుకుని మరింత ఎక్కువగా కష్టపడ్డారు. ఆ ఫలితాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. వెంకటగిరి పరిధిలో టీడీపీకి అత్యల్పంగా ఓట్లు పోలయ్యాయి. దీంతో సహజంగానే హైకమాండ్ దగ్గర ఆనం పరపతి పెరిగే అవకాశం ఉంది. గతంలో మంత్రి పదవికోసం పోటీ పడి ఇబ్బంది పడిన ఆయన, ఇప్పుడు పార్టీకోసం బాగా కష్టపడ్డారనే పేరు తెచ్చుకుంటున్నారు. స్థానిక ఎన్నికలతోపాటు, తిరుపతి ఉప ఎన్నిక కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది.

గురుమూర్తి సునాయాస విజయం ఊహించినదే అయినా.. కొన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ తగ్గడంతో అధికార వైసీపీ నేతలు ఆలోచనలో పడ్డారు. మెజార్టీ తగ్గిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ చార్జి మంత్రులు ఫలితాలపై పోస్ట్ మార్టమ్ మొదలు పెట్టారు. పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చి, లెక్కలు తేలాక ఏ ఎమ్మెల్యే సత్తా ఎంత అనేది తేలుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: