ఐ ప్యాక్ సంస్థ ద్వారా ప్రశాంత్ కిషోర్ ఎన్నిక‌ల్లో పోటీచేసే పార్టీలకు మద్దతుగా వ్యూహాలను అమలుచేసి వాటిని గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకుంటుంటారు. ప్రశాంత్ కిషోర్ అమలు చేసిన వ్యూహాలు, ప్రచార తీరుతెన్నులే 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రధానమంత్రి అవడానికి కారణమైందనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌, ఏపీలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తమిళనాడులో స్టాలిన్‌, తాజాగా పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అయితే రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తోన్న ప్రశ్నలు ఏంటేంటే రాబోయే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎవరికి పనిచేస్తున్నారు? ఏ పార్టీకి అనుకూలంగా వ్యూహాలను రచిస్తున్నారు?..  జాతీయస్థాయి అధికారం ఏ పార్టీకి కట్టబెట్టపోతున్నారు? అని.

కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా తెర‌వెన‌క మంత్రాంగం?
దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ పనితీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆర్థికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం కరోనా కట్టడిని వదిలేసిన మోడీ, అమిత్ షా తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రశాంత్ కిషోర్ బెంగాల్ ఎన్నికల తర్వాత జాతీయస్థాయిలో కీలక ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన పీకే ఆ పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతోపాటు వాటి మిత్రపక్షాలుగా ఉన్నవాటికి కూడా ఆయా రాష్ట్రాల్లో గెలిపించ‌డానికి బాధ్యత తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ప‌రిస్థితి ఏంటి?
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చేస‌రికి ప‌రిస్థితి కొంత చిత్రంగా మారింది. ఈసారి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ప‌నిచేయ‌మ‌ని చంద్ర‌బాబునాయుడు ప్ర‌శాంత్‌కిషోర్‌ను కోర‌గా ఆయ‌న నిరాక‌రించిన‌ట్లు స‌మాచారం. తాజాగా కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షంగా రాహుల్‌గాంధీ నుంచి రేవంత్‌రెడ్డి ద్వారా చంద్ర‌బాబు కోసం సంప్ర‌దింపులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షంగా తెలుగుదేశం పార్టీని పీకే గెలిపిస్తారా?  రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ కోసం వ్యూహాలు అమ‌లుచేస్తారా? అనేదానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఏ పార్టీల త‌ర‌ఫున ఏయే రాష్ట్రాల్లో ప‌నిచేసి కాంగ్రెస్‌కు జాతీయ‌స్థాయిలో అధికారాన్ని క‌ట్ట‌బెట్ట‌బోతున్నారు? అనేదానిపై ఉన్న సందిగ్ధ‌త‌ను పీకేనే తొల‌గించాల్సి ఉంది.!!



మరింత సమాచారం తెలుసుకోండి: