ఏపీలో సీనియర్ నాయకులు...నిదానంగా తమ వారసులని లైన్‌లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్లు...తమ వారసులని రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. అలాగే గత ఎన్నికల్లో పలువురు సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని, తమ వారసులని ఎన్నికల బరిలో నిలబెట్టారు. వచ్చే ఎన్నికల్లో సైతం మరికొందరు సీనియర్ నేతలు రాజకీయాల నుంచి కాస్త బయటకొచ్చి విశ్రాంతి తీసుకుందామని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తమ వారసులని ఎన్నికల బరిలో నిలబెట్టడానికి సిద్ధమవుతున్నారు.


ఈ క్రమంలోనే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైతం, తన వారసుడుని నెక్స్ట్ ఎన్నికలకు రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్‌లో కీలక నాయకుడుగా పనిచేసిన భూమన, వైఎస్సార్ మరణంతో జగన్ వెంట నడిచారు. అలాగే చిరంజీవి రాజీనామాతో తిరుపతి స్థానానికి ఉపఎన్నిక రావడంతో 2012లో వైసీపీ తరుపున నిలబడి, ఆ ఉపఎన్నికలో విజయం సాధించారు.


2009లో చిరంజీవి ప్రజారాజ్యం నుంచి తిరుపతిలో గెలిచారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్నారు. దీంతో చిరంజీవి తిరుపతి స్థానానికి రాజీనామా చేయడంతో, ఉపఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో భూమన వైసీపీ నుంచి గెలిచారు.


ఇక 2014లో వైసీపీ తరుపున నిలబడి ఓడిన భూమన 2019 ఎన్నికల్లో కేవలం 700 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి సుగుణమ్మపై గెలిచారు. సీనియర్ నేత కావడంతో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా భూమనకు పదవి రాలేదు. అయితే మరొకసారి కేబినెట్‌లో మార్పులు జరగనున్న నేపథ్యంలో, తనకు జగన్ ఛాన్స్ ఇస్తారేమో అని చూస్తున్నారు. పైగా ఇదే చివరి అవకాశం అని చెప్పేస్తున్నారు.


ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో తాను తప్పుకుని తనయుడు అభినయ్ రెడ్డిని బరిలో నిలపాలని చూస్తున్నారు. పోనీ ఇప్పుడు తనకు మంత్రి పదవి ఇవ్వకపోయిన తనయుడుకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే, నెక్స్ట్ ఎన్నికలని ఎదురుకునేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మొత్తానికైతే వచ్చే ఎన్నికలకు భూమన వారసుడు రెడీ అయిపోయారనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: