తిరుమలేశుని సేవకు అంబానికి చెందిన జియో సంస్థ ముందుకు వచ్చింది. ఇకపై టీటీడీ సేవలన్నీ ఒకే యాప్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీటీడీకి  సహకరించేందుకు జియో సంస్థ అంగీకరించింది. ఇందుకు సంబంధించి టీటీడీ - జియో రెండూ ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్  శ్రీ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమక్షంలో అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి జియో ప్రతినిధి శ్రీ అనిష్ ఎంఓయూ పై సంతకాలు చేశారు.


కొవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేయడంతో ఒకేసారి లక్షల మంది భక్తులు టికెట్ కోసం ప్రయత్నించారని టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ సర్వర్లలోనూ సమస్యలు ఏర్పడ్డాయని... సమస్యలను అధిగమించి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం టోకెన్లు జారీ చేయడం కోసం జియో సంస్థ ముందుకు వచ్చిందని సుబ్బారెడ్డి తెలిపారు. గత నెలలో జియో క్లౌడ్ టెక్నాలజీ ద్వారా సర్వదర్శనం,  ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేశామని సుబ్బారెడ్డి తెలిపారు.


అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు గంటల లోపు టికెట్ల బుక్ చేసుకున్నట్లు సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ సంబంధించిన అన్ని సేవలు,  సమస్త సమాచారం ఒకే చోట లభించేలా జియో సంస్థ ఓ యాప్ తీసుకురాబోతోంది. ఈ యాప్ లో భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి అన్ని సేవలు  అందుబాటులో ఉంటాయి. రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున  ఈ యాప్ ను  ఆవిష్కరించే  ఏర్పాటు చేయాలని చైర్మన్ సుబ్బారెడ్డి కోరారు. సుబ్బారెడ్డి విజ్ఞప్తికి జియో ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.


ఐదేళ్లుగా టీటీడీకి ఉచితంగా సాంకేతిక  సహకారం అందిస్తున్న టిసిఎస్ సమన్వయంతో జియో సంస్థ ఉచితంగా మెరుగైన సేవలు అందించనుంది. టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జియో సంస్థ ప్రతినిధులు శ్రీ బీపీ సింగ్, శ్రీ అమర్, శ్రీ దుగ్గల్ , కె.భారతి, టీటీడీ ఐటి విభాగం ఇన్చార్జి శ్రీ శేషారెడ్డి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సందీప్ ఈ కార్యక్రమంలో   పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ttd