హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. ఈనెల 30న ఉద‌యం ఏడు గంట‌ల నుంచి సాయంత్రం ఏడు గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. హుజురాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో స‌మ‌స్యాత్మక పోలింగ్ కేంద్రాలు 172, అత్యంత స‌మ‌స్యాత్మక పోలింగ్ కేంద్రాలు 73 ఉన్నాయ‌ని ఎన్నిక‌ల సంఘం గుర్తించింది. ఇప్పటికే 20 కేంద్ర సాయుధ బ‌ల‌గాల కంపెనీలు హుజురాబాద్‌కు చేరుకున్నాయి. ఒక్కో కంపెనీలో 80 నుంచి 90 మంది వరకు ఫోర్స్ ఉండేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రానికి 500 మీట‌ర్ల దూరం వ‌ర‌కు 144 సెక్షన్‌ అమ‌లులో ఉంటుందని హుజురాబాద్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

హుజురాబాద్ ఉపఎన్నిక‌ నోటిఫికేష‌న్ వ‌చ్చినప్పటి నుంచి పోలీసులు డ్రోన్ కెమెరాల‌తో నిరంత‌రం నిఘా పెట్టారు. పోలింగ్ రోజున మ‌రింత జాగ్రత్తగా ఉండాల‌ని పోలీస్‌ కమిషనర్‌ స‌త్యనారాయ‌ణ ఆదేశాలు జారీ చేశారు. 73 అత్యంత స‌మ‌స్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో  2000 మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఇక ఓటర్లను ప్రలోభాల‌కు గురి చేస్తే.. ఫిర్యాదు కోసం సీ విజిల్ యాప్‌ను ఉప‌యోగించుకోవాల‌ని యువ‌త‌ను ఎన్నికల సంఘం కోరింది. ఏవైనా అక్రమాలు జ‌రిగితే ఫిర్యాదు చేయాల‌ని కోరింది. మొత్తంమీద హుజురాబాద్‌ నియోజకవర్గంలో భారీ బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఐదు మండ‌లాల్లో 2,36,873 మంది ఓట‌ర్లు ఉన్నార‌ని అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 1,17,779 మంది ఉండ‌గా... మ‌హిళ‌లు 1,19,093 మంది ఉన్నారు. పురుషుల కంటే మ‌హిళల ఓట్లు 1314 ఎక్కువ‌గా ఉన్నాయి. ఇటీవ‌ల 10 వేల వ‌ర‌కు కొత్త ఓట్లు న‌మోదు అయ్యాయి. 2018 ఎన్నిక‌ల సంద‌ర్భంగా హుజురాబాద్‌లో 2,26,000 వేల‌ పైచిలుకు ఓట్లు ఉండేవి. తాజాగా ఉపఎన్నిక నేప‌థ్యంలో కొత్తగా ఎన్‌రోల్ చేసుకున్న వారికి ఓటు హ‌క్కు క‌ల్పించారు. దీంతో 10 వేల ఓట్లు పెరిగి ఆ సంఖ్య 2,36,873కు చేరుకుంది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఐదు మండ‌లాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ఇల్లంతకుంట మండ‌లంలో మిగ‌తా మండ‌లాల కంటే త‌క్కువ ఓట్లున్నాయి. ఈ మండ‌లంలో కేవ‌లం 24,799 ఓట్లు ఉండ‌గా.. అత్యధికంగా హుజురాబాద్ మండ‌లంలో 61,673 ఓట్లు ఉన్నాయి. హుజురాబాద్‌ నియోజకవర్గంలో అత్యధికంగా దళితుల ఓట్లు 45 వేలకుపైగా ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: