ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగుతుంది. గెలవడం కూడా అలా ఇలా కాదు...వన్ సైడ్‌గానే...పంచాయితీ ఎన్నికల్లో దాదాపు 80 శాతం పైనే, మున్సిపల్ పోరులో 99 శాతం, కార్పొరేషన్ వార్‌లో 100 శాతం, ఎం‌పి‌టి‌సిల్లో 85 శాతం వరకు, జెడ్‌పి‌టి‌సిల్లో 95 శాతం వరకు గెలుపు వైసీపీదే. అలాగే తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో వైసీపీదే గెలుపు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురేలేదు. అంటే అన్నీ ఎన్నికల్లో వైసీపీదే విజయం.

ఇక తాజాగా 12 మున్సిపాలిటీలకు, నెల్లూరు కార్పొరేషన్‌కు ఎన్నిక జరిగింది. ఇందులో 10 మున్సిపాలిటీల్లో, నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ గెలిచింది. కాకపోతే గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ సారి జరిగిన ఎన్నికల్లో కాస్త మార్పు కనిపించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సారి వైసీపీ అధికార బలాన్ని ఉపయోగించినా సరే టీడీపీ కాస్త పోటీ ఇచ్చిందనే చెప్పాలి. అన్నిచోట్ల వైసీపీకి ప్రజా మద్ధతు పూర్తిగా రాలేదు.

నెల్లూరులో క్లీన్‌స్వీప్..చంద్రబాబు కంచుకోట కుప్పంలో సత్తా చాటడం జరిగాయి గానీ, కొన్ని మున్సిపాలిటీల్లో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. అలాగే దర్శి, కొండపల్లి మున్సిపాలిటీలని టీడీపీ దక్కించుకుని సత్తా చాటింది. ఈ రెండు చోట్ల టీడీపీ గెలుస్తుందని, టీడీపీ వాళ్లే ఊహించలేదనే చెప్పాలి.

అసలు కొండపల్లిపై పెద్దగా ఆశ పెట్టుకోలేదు. ఇక్కడ వైసీపీ గెలుస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్య రీతిలో టీడీపీ కైవసం చేసుకుంది. కొండపల్లి మున్సిపాలిటీలో 29 వార్డులు ఉండగా టీడీపీ 14, వైసీపీ 14, ఇండిపెండెంట్ ఒకచోట గెలిచారు. దీంతో ఇండిపెండెంట్ కీలకమయ్యారు. చివరిలో ఇండిపెండెంట్ టీడీపీలో చేరిపోయారు. దీంతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి వచ్చింది. ఒకవేళ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్‌అఫిషీయోగా ఓటు వేస్తే, అటు టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని ఓటు వేస్తారు. దీంతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడటం ఖాయం. కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్తితి.


ఆ విషయాన్ని పక్కనబెడితే మైలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ కొండపల్లి మున్సిపాలిటీలో ఓడిపోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మైలవరం వైసీపీ సిట్టింగ్ సీటు...పైగా పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సిల్లో వైసీపీ సత్తా చాటింది. కానీ మున్సిపాలిటీలో చతికలపడ్డారు. అయితే దీనికి కారణం ఓవర్ కాన్ఫిడెన్స్ అని తెలుస్తోంది. ఎమ్మెల్యే వసంత...టీడీపీ నేత దేవినేని ఉమాని తక్కువ అంచనా వేసి..అధికార బలాన్ని నమ్ముకుని బరిలో దిగేశారు. అక్కడే వైసీపీకి తేడా కొట్టిందని చెప్పొచ్చు. పైగా వసంత అక్రమ మైనింగ్ చేస్తున్నారని దేవినేని ఆరోపిస్తూ...మైనింగ్ జరిగే ప్రదేశాలకు వెళ్లడానికి చూసినప్పుడు పోలీసులు రివర్స్‌లో కేసు పెట్టి ఉమాని జైల్లో పెట్టారు. ఈ అంశంలో ప్రజలు కాస్త ఉమాపై సానుభూతితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ సానుభూతి కొండపల్లి ఫలితంలో కనిపించిందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: