ఏపీలో గత ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తర్వాత పార్టీలో ఎక్కడికక్కడ కష్టపడే వారిని గుర్తిస్తూ చంద్రబాబు పదవులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇంచార్జి పదవులు కూడా భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వలస పక్షులకు ఈసారి తాను చోటు ఇవ్వన‌ని.. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెబుతున్నారు. అందుకు తగినట్టుగానే పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాధాన్యం పెంచడంతోపాటు గతంలో ఎప్పుడూ లేనట్టుగా రాష్ట్ర స్థాయిలో అన్ని అనుబంధ కమిటీలను భర్తీ చేశారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా వెళుతున్న‌ విషయమే ఇప్పుడు పార్టీ అభిమానులకు రుచించడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం ఇన్చార్జి పదవి ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కర్రా రాజారావు మృతిచెందడంతో చింతలపూడి టీడీపీ ఇన్‌చార్జ్ పదవి ఎవరికి ? ఇస్తారన్నది గత ఏడెనిమిది నెలలుగా పెద్ద సస్పెన్స్ గా ఉంది.


ఇన్‌చార్జ్ రేసులో ముగ్గురు నేత‌లు...!

ఇన్చార్జి పదవి కోసం మాజీ మంత్రి పీతల సుజాతతో పాటు మాజీ జడ్పీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు జంగారెడ్డిగూడెంకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆకుమర్తి రామారావు ప్రధానంగా పోటీ పడుతున్నారు. విచిత్రమేంటంటే ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో ఆ వ‌ర్గం నేతలను ఇన్చార్జిగా నియమించకుండా.. ఓసీ (క‌మ్మ‌) వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకి ఈ పదవి ఇస్తారని ఆయన వర్గీయులు బలంగా ప్రచారం చేసుకుంటున్నారు.


గత ఆగస్టు నుంచి అదిగో పులి ఇదిగో మేక అన్న చందంగా గంటా మురళీకి చింతలపూడి ఇన్‌చార్జ్‌ పదవి వచ్చేసిందని ఆయన అనుచరులు ఒకటే డబ్బా కొట్టుకుంటున్నారు. మురళికి ఇన్చార్జి పదవి లేదు.. సరికదా కనీసం ఎస్సీ వర్గానికి చెందిన ఎవరో ఒక నేతతో ఈ పదవి భర్తీ చేస్తే నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ కేడర్ భావిస్తోంది. అధిష్టానం మాత్రం జిల్లాలో కొవ్వూరు - చింతలపూడి నియోజకవర్గాల‌ ఇన్చార్జ్‌ విషయంలో ఏ విషయం తేల్చ‌డం లేదు.

 
ముర‌ళీ వ‌చ్చాకే పార్టీకి మ‌రింత మైన‌స్సా..?

2019 ఎన్నికలకు ముందు వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో టిడిపిలోకి వచ్చిన మురళీకి నియోజకవర్గంలో కాదు కదా సొంత పంచాయతీలో కూడా పట్టు లేదని తేలిపోయింది. మురళి ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన సమయంలో మురళి పార్టీలోకి వస్తే 20 వేల ఓట్ల మెజార్టీతో చింత‌ల‌పూడి సీటు టిడిపి గెలుస్తుందని అధిష్టానానికి కొంద‌రు తప్పుడు నివేదికలు పంపారు. అయితే చింతలపూడి నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడు లేనంత‌ ఘోరంగా టిడిపి గత ఎన్నికల్లో 36 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది.

మురళి రాక పార్టీకి ప్లస్ అవ్వడం ఏమోగానీ.... బీసీ, ఎస్సీ వర్గాల్లో కూడా బాగా మైనస్ అయింది. అప్పటికే ఆయనపై ఉన్న వ్యతిరేకతకు తోడు.. ఆయన టిడిపిలోకి రావడంతో ఆ ప్రభావం టిడిపిపై గట్టిగా పడింది. ప్రభుత్వ వ్యతిరేకకు తోడు మురళీపై ఉన్న వ్యతిరేకత బలంగా తోడవడంతోనే టిడిపి ఏకంగా 36 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఇక ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మురళి సొంత పంచాయతీ కామవరపుకోటను గెలిపించుకునేందుకు పంచాయతీ స్థాయి నేతగా ఆయన దిగ‌జారాల్సి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేసినా... వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు పోటీపడినా మురళి పంచాయతీని గెలిపించుకోలేక పోయారు. జంగారెడ్డిగూడెం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ వేలుపెట్టిన ముర‌ళీ అక్క‌డ కూడా త‌న ఒంటెద్దు పోక‌డ‌ల‌తో పార్టీని నిలువునా ముంచేశారు.



స్వ‌గ్రామంలోనూ ప‌ట్టులేదే...!

మరో విచిత్రం ఏమిటంటే ఆయన స్వగ్రామం పాతూరులో మూడు వార్డులు ఉంటే ఒక వార్డులో కూడా టిడిపి విజయం సాధించలేదు... సరికదా ఆ మూడో వార్డుల్లో వైసిపి సానుభూతిపరులుగా పోటీ చేసిన వారు భారీ మెజార్టీల‌తో గెలిచారు. ఒక వార్డులో 126 ఓట్ల మెజార్టీతో - మరో వార్డులో 110 ఓట్ల మెజార్టీతో - మరో వార్డులో 53 ఓట్ల మెజారిటీతో ఘన విజయాలు సాధించారు. దీనినిబట్టి స్వగ్రామంలోనే మురళికి ఏమాత్రం ప‌ట్టు లేదని తేలిపోయింది. రేపు సొసైటీ ఎన్నికలు జరిగితే కామవ‌ర‌పు కోట సొసైటీ ఎన్నికల్లోనూ మురళి తెలుగు దేశం పార్టీని గెలిపించే పరిస్థితి లేదు... పైగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది... మురళి సొంత సోదరుడు పంచాయతీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌ వైసీపీ కండువా కప్పుకున్నారు.

మురళీ సోదరుల చెరో పార్టీలో ఉండడంతో అసలు కేడర్ కూడా ఎటువైపు వెళ్ళాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటి నేతకు నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఎలా ? ఇస్తారని టిడిపి వీరాభిమానులు ప్రశ్నిస్తున్నారు. మురళీ టిడిపిలోకి వచ్చాక కామవరపుకోట మండలంలో దశాబ్దాలుగా టిడిపిలో కీలక పాత్ర పోషించిన నేతలు అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అన్ని కీలక పదవులు మురళి తన వర్గానికి కట్టబెట్టు కుంటున్నారు. ఇప్పుడు అదే మురళికి ఇన్చార్జి పదవి ఇస్తే నియోజకవర్గంలో పార్టీ ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని కూడా పార్టీ కేడర్ ఆందోళన చెందుతోంది. మ‌రి పార్టీ అధిష్టానం స‌రైన నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని వారు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: