ఉద్యోగుల‌కు సంబంధించి ఇప్ప‌టిదాకా న‌డుస్తున్న క‌థ ఓ క్లైమాక్స్ వ‌చ్చింది.నిన్న అర్ధ రాత్రి వ‌ర‌కూ జ‌రిగిన చ‌ర్చ‌లు ఫ‌లించాయి అని అనుకోవ‌చ్చు.పీఆర్సీకి సంబంధించి ఓ మెట్టు దిగివ‌చ్చి ఇక‌పై ఐదేళ్లకొక‌సారి పీఆర్సీ వేస్తాన‌ని జ‌గ‌న్ త‌ర‌ఫున మంత్రుల క‌మిటీ ప్ర‌తినిధులు హామీ ఇచ్చారు. చ‌ర్చ‌ల్లో ఆర్థిక మంత్రి ఎంట్రీ ఇచ్చారు.అదేవిధంగా బొత్స, పేర్ని నాని కూడా నిన్న‌టి చ‌ర్చ‌ల్లో పాల్గొని త‌మ వాదన వినిపించారు. చ‌ర్చ‌ల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప్ర‌భుత్వ పెద్ద సజ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి  వ్య‌వ‌హ‌రించారు.

ఇక త‌మ కార్యాచ‌ర‌ణ మాత్రం య‌థావిధిగానే ఉంటుంద‌ని,చ‌ర్చ‌లు ఓ కొలిక్కి వ‌చ్చేంత వ‌ర‌కూ ఉద్య‌మిస్తూనే ఉంటామ‌ని చెబుతున్నారు ఉద్యోగ సంఘాల నాయ‌కులు.అయితే ఇప్ప‌టిదాకా చేసిన చ‌ర్చ‌ల‌లో కొంత స్త‌బ్ద‌త తొల‌గింద‌ని కూడా వారు అంటున్నారు. ఆరో తేదీలోగా స‌మ‌స్య ప‌రిష్కారం కావాల‌న్న ఆలోచ‌న తోనే సీఎం ఉన్నార‌ని కూడా తెలుస్తోంది.ఇక ఉద్యోగుల పెన్డౌన్ పై సీఎం స్పందించారు. నిన్న‌టి వేళ మంత్రుల క‌మిటీతో దీనిపై చ‌ర్చించారు.

మ‌రోవైపు స‌మ్మెకు సంబంధించి ఉద్యోగులు మ‌రింత ఉత్సాహంతోనే ముందుకు వెళ్లాల‌ని చూస్తున్నా స‌మ‌స్య‌ను ఓ కొలిక్కి తెచ్చేందుకు మంత్రులు క‌మిటీ ప్ర‌య‌త్నిస్తోంది.ఒక‌వేళ ఈ రోజు కూడా చ‌ర్చ‌లు జ‌రిగితే కీల‌క విష‌యాల‌పై మంత్రులు ఓ స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు అవ‌కాశం ఉంది. అద్దెభ‌త్యం శ్లాబుల‌పై ఇప్ప‌టికే ఓ క్లారిటీ వ‌చ్చింది. మంత్రుల క‌మిటీ తాజా ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం
రెండు ల‌క్ష‌ల లోపు జ‌నాభా ఉంటే ఎనిమిది శాతం, రెండు నుంచి ఐదు ల‌క్ష‌ల మ‌ధ్య జ‌నాభా ఉంటే 12శాతం, ఐదు నుంచి 15 వ‌ర‌కు జ‌నాభా ఉంటే 16 శాతం,15 ల‌క్ష‌ల‌కు పైగా జ‌నాభా ఉంటే 24 శాతం హెచ్ఆర్ ఇచ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని మంత్రుల క‌మిటీ  ఓ ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చింది.దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.మ‌రోవైపు చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చేదాకా ఉద్య‌మిస్తామ‌ని ఉద్యోగ సంఘాలు చెబుతున్నా రేపో మాపో ఈ క‌థ మాత్రం సుఖాంతం కానుండ‌డం త‌థ్యం అని తేలిపోయింది నిన్న‌టి రాత్రి చ‌ర్చ‌ల‌తో!


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp