
బీజేపీకి ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలను మించిన పరాభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 77 స్థానాలు దక్కించుకున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. కనీసం ఒక్క మున్సిపాలిటీలో కూడా బీజేపీ గెలవకపోవడం విశేషం.. అటు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే.. శాసన సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సువెందు అధికారి సొంత ప్రాంతంలోనూ టీఎంసీ హవాయే నడిచింది. నందిగ్రామ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ప్రాంతమైన కాంతి మున్సిపాలిటీని టీఎంసీ దక్కించుకుంది.
మరో విచిత్రం ఏంటంటే.. హమ్రో పార్టీ అధికార టీఎంసీ, జీజేఎం, బీజేపీలను తోసి రాజని దార్జీలింగ్ మున్సిపాలిటీని గెలుచుకుంది. ఇక టీఎంసీ హవా ఏ స్థాయిలో ఉందంటే.. టీఎంసీకి దక్కిన మున్సిపాలిటీల్లో 27 చోట్ల ప్రతిపక్ష పార్టీలు కనీసం ఖాతా కూడా తెరవలేదంటే అర్థం చేసుకోవచ్చు.
మొత్తం 108 స్థానాల్లో 102 గెలుచుకోవడం అంటే మామూలు విజయం కాదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకు కలసి రావడం సాధారణమే.
కానీ.. ఈ స్థాయిలో టీఎంసీ తన మాజిక్ నిలుపుకోవడం కూడా విశేషమే.. ఈ ఎన్నికలు బీజేపీలో నైరాశ్యం నింపాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు జరిగిన ఈ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. ఈ ఫలితాలకు సంకేతాలుగా నిలుస్తాయా అన్న చర్చ జరుగుతున్నా.. ఇవి స్థానిక ఎన్నికలు కావడంతో అంత సీన్ ఉండకపోవచ్చు. స్థానిక అంశాలతో పాటు అధికారంలో ఉన్న పార్టీ అయితే.. తమకు సహకరిస్తుందన్న ఆలోచన ఓటర్లలో ఉండటం కూడా ఓ కారణం కావచ్చు. ఏదేమైనా బెంగాల్ అంటే మమత.. అని మరోసారి రుజువైంది.