రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇండియాకు తలనొప్పిగా మారింది. ఈ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఒడిదొడుకులకు లోనవుతోంది. తాజాగా ఐక్య రాజ్య సమితి ఇండియాకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది భారత దేశ ఆర్థిక వృద్ధి రేటుపై వేసుకున్న అంచనాలను ఐక్యరాజ్యసమితి తగ్గించేసింది. ఈ ఏడాది భారత్‌ 6.7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని మొదట్లో ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. కానీ.. తాజాగా ఐక్యరాజ్యసమితి వ్యాపార, అభివృద్ధి సదస్సు నివేదిక.. ఈ రేటును 4.6శాతానికి తగ్గించింది.


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఇంధన కొరత ఏర్పడి ధరలు పెరగడం ఒక కారణం. దీనివల్ల ఇండియాలో ఆహార ద్రవ్యోల్బణం, ఆర్థిక అస్ధిరత్వం వల్ల వృద్ధి రేటు తగ్గుతుందని ఈ నివేదిక చెబుతోంది. అంతే కాదు.. 2022లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను కూడా ఐక్య రాజ్య సమితి నివేదిక తగ్గించేసింది. మొదట్లో ఇది 3.6శాతం ఉంటుందని భావించిన ఐక్య రాజ్య సమితి.. ఇప్పుడు దాని నుంచి 2.6 శాతానికి తగ్గించింది.


ప్రపంచ దేశాల ఆర్థిక ఆంక్షలతో ఈ ఏడాది రష్యా తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుందని కూడా ఐక్య రాజ్య సమితి అంచనా వేస్తోంది. పశ్చిమ ఐరోపా దేశాలు, మధ్య, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల వృద్ధి రేటులో కూడా చెప్పుకోదగ్గ తగ్గుదల ఉంటుందని ఐక్య రాజ్య సమితి  భావిస్తోంది. తన తాజా నివేదికలో ఈ విధంగానే అంచనాలు పొందుపరిచింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు డిమాండ్‌ పెరగడం.. చమురు ధరలు పెరగడం వల్ల కొన్ని ఆసియా దేశాలు కొంత లాభపడతాయని కూడా ఐక్య రాజ్య సమితి తెలిపింది.


ఏదేమైనా ఇప్పటికే ఈ యుద్ధం సాకు చూపించి ఇండియాలో అన్ని రంగాలు తమ ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవంలో ఈ యుద్ధం ప్రభావం ఇండియాలో ఎలా ఉంటుందో కానీ.. అనేక సంస్థలు ఈ సాకు చూపి ధరలు పెంచగలమా అన్న కోణంలో ఆలోచించి ముందుకు వెళ్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: