ఆర్ఎస్ఎస్ కార్యకర్తల డ్రెస్ కోడ్ లో భాగమైన నిక్కర్ కి ఇప్పుడు ఓ అవస్థ వచ్చి పడింది. ఈ నిక్కర్లను తగలబెట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కర్నాటకలో ఈ వివాదం మొదలైంది. దీన్ని చెడ్డీ వివాదంగా ఇప్పుడు పిలుస్తున్నారు. అసలీ వివాదం ఎందుకొచ్చిందంటే..
 
విద్యను కాషాయీకరణ చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ పై ఆరోపణలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఓ అడుగు ముందుకేసింది. కర్నాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ఇంటి ముందు ఖాకీ నిక్కర్లను తగలబెట్టారు ఎన్.ఎస్.యు.ఐ నేతలు. ఆ వివాదం అక్కడితో సమసిపోలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య.. ఈ నిక్కర్ల వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. కేవలం పోలీస్ ల ముందే కాదని, రాష్ట్రంలో ఎక్కడైనా తాము ఆ నిక్కర్లను తగలబెడతామని హెచ్చరించారు. ఆయన అన్నట్టుగానే ఆ తర్వాత ఒకటి రెండు చోట్ల ఈ ఘటనలు జరిగాయి.

ఇక్కడితో ఈ వ్యవహారం ఆగిపోలేదు. నిక్కర్లను తగలబెట్టడాన్ని ఆర్ఎస్ఎస్ తీవ్రంగా పరిగణించింది. దీంతో వారు సిద్దరామయ్య ఇంటికి నిక్కర్ బస్తాలను పార్శిల్ చేయాలని నిర్ణయించారు. యువమోర్చాలకు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ పిలుపు మేరకు వారు నిక్కర్లను బస్తాలుగా కట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు పంపిస్తున్నారు. దీంతో ఇది ఇప్పుడు కర్నాటకలో సంచలనంగా మారింది.

మధ్యలో నిక్కర్లు ఏం చేశాయి.?
కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది ఆర్ఎస్ఎస్ పై. మరి మధ్యలో నిక్కర్లు ఏం చేశాయి. నిక్కర్ల మీద ఈ కక్షసాధింపు ఎందుకు. నిక్కర్లని తగలబెడితే ఎవరికి ఉపయోగం. అది వృథా ఖర్చు కాదా. ఇంకా పర్యావరణానికి కూడా హానికరం అంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీల మధ్య గొడవలు నిక్కర్లు తగలబెట్టడం దేనికో అర్థం కావడంలేదు. అయితే ఇప్పుడీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కాంగ్రెస్ వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. నిక్కర్లను ఎందుకు తగలబెడుతున్నారని, ఇది మంచి సంప్రదాయం కాదని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: