కరోనా  వైరస్... మొన్నటి వరకు ఈ పేరెత్తితే చైనాలోని ప్రజలే భయపడే వారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది ప్రాణభయంతో వణికిస్తుంది ఈ మహమ్మారి. చైనాలో 3200 మందిని  ఈ ప్రాణాంతకమైన వైరస్ పొట్టన పెట్టుకుంది. ఇక 90 వేల మందికి పైగా ఈ వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకుతున్నారు. అదేంటో గాని ఈ వైరస్  చైనా దేశంలో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. కానీ మిగతా దేశాలలో మాత్రం ఇప్పుడిప్పుడే విజృంభిస్తుంది ఈ మహమ్మారి వైరస్. దీంతో ప్రపంచ దేశాల ప్రజలు కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి ప్రాణభయంతో జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా ప్రవేశించి.. ఈ వైరస్ ప్రస్తుతం అందరినీ ప్రాణభయంతో వినిపిస్తోంది. 

 

 

 ఇప్పటికే  ఈ వైరస్ 31 మందికి సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ బారిన పడిన వారికి... ఈ వైరస్ అనుమానితులకు  కూడా ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి... చికిత్సను అందిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా ఆస్పత్రిలో కరోనా పేషంట్స్ కోసం ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కరోనా  లక్షణాలు ఉన్న ఓ పేషెంట్ ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఈ ఘటన పంజాబ్ లో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పంజాబ్  మోఘా లో  ఇటీవలి దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉండడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఇక అతనికి చికిత్స చేసిన వైద్యులు అతనికి కరోనా  లక్షణాలు ఉన్నాయి అంటూ ఐసోలేషన్ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. కరోనా  లక్షణాలు ఉన్నాయి అని అటు మీడియా ప్రతినిధులు కూడా అతని ఫోటోలు వీడియోలు తీశారు. 

 

 

 ఇక మీడియా చేసిన హడావిడికి  ఒక్కసారిగా హడలిపోయాడు  ఆ పేషంట్. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రి సిబ్బంది కళ్లుగప్పి అక్కడి నుంచి పారిపోయాడు. ఇక ఆ పేషెంట్ పారిపోయిన విషయం తెలుసుకున్న ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది షాక్ కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అతడిని పట్టుకునేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు. పోలీసులు వెళ్లినప్పటికీ హాస్పిటల్ కు  వచ్చేందుకు మాత్రం ఆ వ్యక్తి నిరాకరించాడు. ఇక చివరికి కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో ఆస్పత్రికి వచ్చేందుకు అంగీకరించాడు సదరు పేషంట్. దీంతో వైద్యులు  అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా కరోనా  లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఆ వ్యక్తి నమూనాలని  పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఆ పేషెంటు ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: