తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కరోనా తగ్గుముఖం పడుతోంది. ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. ఏపీలో నిన్న 80 కరోనా కేసులు నమోదు కాగా తెలంగాణలో కేవలం 27 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్, సూర్యాపేట మినహా ఇతర జిల్లాల్లో కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. 
 
హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలపై కరోనా పంజా విసురుతోంది. దీంతో ప్రభుత్వం ఈ రెండు జిల్లాల్లో కేసులు నమోదు కాకుండా చర్యలకు సిద్ధమైంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సమాచారం. నిన్నటివరకు రాష్ట్రంలో 970 కరోనా కేసులు నమోదు కాగా 25 మంది మృతి చెందారు. 
 
197 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 58 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 693 మంది చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు 9 ల్యాబ్ లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో వైద్యులకు కరోనా రోగులను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా నాలుగు లక్షల పీపీఈ కిట్లు, 5 లక్షల ఎన్ 95 మాస్కులు అందుబాటులోకి తెచ్చిందని సమాచారం. ప్రభుత్వం గచ్చిబౌలిలో ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిందని... త్వరలో ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని సమాచారం. ప్రభుత్వం క్యాన్సర్, కిడ్నీ, డయాలసిస్ రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతోంది. మరొకొన్ని రోజుల్లో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: