ఆగస్ట్ నాటికల్లా కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ వస్తుందంటోంది అమెరికన్ ఫార్మా కంపెనీ ఇనోవియో. ఈ సంస్థ జంతువుల మీద చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. మనుషుల మీద చేసిన ప్రయోగాలపై నివేదిక త్వరలో రానుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్‌ కల్లా వ్యాక్సిన్ రెడీ అంటున్నారు ఫార్మా సంస్థ ప్రతినిధులు.

 

కరోనా వైరస్‌కు తాము కనుక్కొన్న వ్యాక్సిన్ మనుషులపై ప్రయోగించినట్లు అమెరికాకు చెందిన ఇనోవియో ఫార్మా ప్రకటించింది. ఏప్రిల్‌లోనే తాము వ్యాక్సిన్‌ను మనుషులపై టెస్ట్‌ చేశామని.. జులైలో ఫలితాలు వస్తాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే ఎలుకలు, గినియా పిగ్స్‌పై ప్రయోగించిన ఈ వ్యాక్సిన్ సక్సెస్‌ఫుల్‌గా పని చేసింది. వ్యాక్సిన్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. శరీరంలో యాంటీ బాడీస్‌ను పెంచినట్లు రుజువైంది. మనుషుల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తే.. ఆగస్టు కల్లా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని సంస్థ భావిస్తోంది.   

 

ఇనోవియో కనుక్కున్న వ్యాక్సిన్‌కు  INO-4800 అని పేరు పెట్టారు. మనుషులపై చేసిన ప్రయోగాలకు సంబంధించిన ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత.. లైసెన్స్ కోసం జులై లేదా ఆగస్టులో US ఫుడ్ అండ్ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాన్ని సంప్రదిస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వినోవియో తయారు చేసిన వ్యాక్సిన్ కరోనా వైరస్ కణాలకుండే కొమ్ముల మీద దాడి చేసి.. వాటిని నిర్వీర్యం చేసే పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. వ్యాక్సిన్ డోస్‌ను భారీ సంఖ్యలో జంతువుల మీద ప్రయోగిస్తోంది వినోవియో ఫార్మా. మరిన్ని కుందేళ్లు, కోతుల మీద వ్యాక్సిన్ ప్రయోగించి ఫలితాలను విశ్లేషించనున్నారు. 

 

కరోనాకు వ్యాక్సిన్ కనుక్కునేందుకు ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా సంస్థలు  ప్రయోగాలు చేస్తున్నాయి. చైనాకు చెందిన పెకింగ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ కాకుండా.. కరోనాను కంట్రోల్ చేసే మందు కనుక్కునే దిశగా ముందడుగు వేసింది. మిగతా వాటితో పోలిస్తే అమెరికన్ ఫార్మా సంస్థ ఇనోవియో చాలా వేగంగా ఉంది. సంస్థ ప్రయోగాలు సక్సెస్ అయితే.. ఆగస్టు కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు. ఆగస్టులో వ్యాక్సిన్‌కు లైసెన్స్ వచ్చినా.. అది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: