భారత్ చైనా వివాదం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా పరిష్కారం కావడం లేదు. చైనా భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనా ప్రస్తుతం వివాదాస్పద ప్రాంతాల్లోకి భారీగా సైనిక బలగాలను దించుతోందని సమాచారం. దీంతో భారత్ అప్రమత్తమైంది. భారత్ తూర్పు లడఖ్ లో ఉపరితలం వద్ద క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరించింది. ఈ క్షిపణులలో ఆకాష్ క్షిపణి కుడా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఆకాష్ క్షిపణి చైనా విమానాలను సెకన్ల వ్యవధిలో పేల్చేయగలదు. భారత్ భారీ స్థాయిలో సైనిక పరికరాలను రవాణా చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరిగితే చైనాకు తగిన బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది. ప్రభుత్వ వర్గాలు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తూర్పు లడఖ్ లో ఆర్మీ మరియు వైమానిక దళం, వైమానిక రక్షణ వ్యవస్థలను మోహరించినట్లు తెలుస్తోంది. చైనా కొన్ని రోజుల క్రితం సుఖోయ్ 30 లాంటి యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. 
 
భారత్ ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలో ఆకాష్ క్షిపణి అధిక సామర్థ్యం కలది. ఈ క్షిపణి ఉపరితలం నుంచి గాలికి 30 కిలోమీటర్ల ఎత్తులో సైతం శత్రు క్షిపణిని అడ్డగించగల సామర్థ్యం కలది. సూపర్ సోనిక్ వేగంతో లక్ష్యాలను చేరుకోవడానికి వచ్చే క్షిపణులను అడ్డుకోవడంలో ఈ క్షిపణి ప్రధానంగా సహాయపడుతుంది. మరోవైపు భారత్ 54 కొత్త మొబైల్ టవర్లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. 
 
కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ 54 మొబైల్ టవర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. భారత్ వాస్తవాధీన రేఖ ప్రక్కనే ఉన్న ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కూడా వేగవంతమైంది. ఈ రోడ్ల నిర్మాణం భద్రతా దళాల కదలికలను సులభతరం చేయనుంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బి.ఆర్.వో) రహదారుల నిర్మాణాన్ని వేగవంతంచేసింది. అధికారులు బీ.ఆర్.వోకు 15 వేల మంది కార్మికులు అవసరం కాగా స్థానిక కూలీలను నియమించడంతో పాటు జార్ఖండ్ నుంచి కూలీలు లడఖ్ చేరుకున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: