ఆంధ్రప్రదేశ్ పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతిరోజూ 9 వేలకు పైగా రాష్ట్రంలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆదాయం తగ్గడంతో ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయితే కరోనా కష్ట కాలంలోను జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మెప్పు పొందుతోంది. తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఏపీలోని జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. జూనియర్ డాక్టర్లకు స్టై ఫండ్ ను భారీగా పెంచుతూ జగన్ సర్కార్ నిన్న ఉత్తర్వులను విడుదల చేసింది. రాష్ట్ర వైద్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులను విడుదల చేశారు. 2020 జనవరి 1 నుండి పెరిగిన స్టైఫండ్ అమలు కానుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం స్టైఫండ్ భారీగా పెంచడంపై జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ ఉత్తర్వుల ప్రకారం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులకు 19,589 రూపాయలు, పీజీ ఫస్టియర్‌ విద్యార్థులకు 44,075 రూపాయలు, పీజీ సెకండియర్‌ విద్యార్థులకు 46,524 రూపాయలు, పీజీ మూడో సంవత్సరం విద్యార్థులకు 48,973 రూపాయలు, పీజీ డిప్లొమా ఫస్టియర్‌ విద్యార్థులకు 44,075 రూపాయలు, పీజీ సెకండియర్ విద్యార్థులకు 46,524 రూపాయలు, సూపర్‌ స్పెషాలిటీ ఫస్టియర్‌ విద్యార్థులకు 48,973 రూపాయలు, సూపర్‌ స్పెషాలిటీ సెకండియర్‌ విద్యార్థులకు 51,422 రూపాయలను స్టైఫండ్ గా ప్రకటించింది.
 
జగన్ సర్కార్ సూపర్‌ స్పెషాలిటీ మూడో సంవత్సరం విద్యార్థులకు 53,893 రూపాయలు, ఎండీఎస్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు 44,075 రూపాయలు, సెకండియర్‌ విద్యార్థులకు 46,524 రూపాయలు, ఎండీఎస్‌ మూడో సంవత్సరం విద్యార్థులకు 48,973 రూపాయల చొప్పున స్టైఫండ్ ప్రకటించింది. ప్రభుత్వం గతంతో పోలిస్తే స్టైఫండ్ ను భారీగా పెంచడం గమనార్హం. కరోనా విజృంభిస్తున్న తరుణంలో జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: