రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక కార్యక్రమం మొదలవుతోంది. పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ స్టూడెంట్‌ కిట్లు పంపిణీ చేస్తారు. ఈ కిట్లలో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్‌ బ్యాగ్‌ ఉంటాయి. బ్యాగుల విషయంలో అబ్బాయిలకు ఓ రంగు, అమ్మాయిలకు మరో రంగు నిర్థారించారు. ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేస్తారు.
కృష్ణా జిల్లా పునాదిపాడు జడ్పీ హైస్కూలులో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో ఈ కార్యక్రమం మొదలవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్ధులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో ‘స్టూడెంట్‌ కిట్లు’ అందచేస్తోంది ప్రభుత్వం. రోజూ 50 మందికి మించకుండా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టారు. కిట్‌ లు తీసుకున్నవారితో బయో మెట్రిక్, ఐరిష్‌ ద్వారా హాజరు నమోదు చేస్తారు. కిట్‌లలో వివిధ తరగతుల విద్యార్థుల కోసం పలు వస్తువులు అందచేస్తున్నందున ఎక్కడైనా సరైన సైజువి లేకపోయినా, లోపాలు ఉన్నట్లు గుర్తించినా అధికారులకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించుకోలి. ఒకవేళ ఎవరి పేరయినా మిస్ అయితే.. వారు వెంటనే సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్ కి ఫిర్యాదు చేయాలి. లేదా 9121296051, 9121296052 హెల్ప్‌లైన్‌ నంబర్లలో సంప్రదించాలి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివుకునే ప్రతి విద్యార్థికి జగనన్న విద్యాకానుక అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అయితే కొత్త అడ్మిషన్ల విషయంలోకాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నట్టు సమాచారం. కొత్తగా అడ్మిషన్లు పొందినవారి వివరాలు వెంటనే విద్య కానుక లిస్ట్ లో పొందుపరచకపోవడంతో వారిలో కొంతమందికి ఈ వస్తువులు అప్పటికప్పుడు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చని అధికారులంటున్నారు. అయితే వారికి కూడా ఫ్రీసైజ్ దుస్తులను అందుబాటులో ఉంచుతోంది ప్రభుత్వం. దీని ప్రకారం లిస్ట్ లో పేరు మిస్ అయినవారు వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పుకుని కిట్ ను పొందే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: