అమరావతి ఉద్యమం విషయంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో పార్టీ ఇప్పుడు అమరావతి ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేసారు. మేము ఎక్కడ ఉన్నా మా ఆలోచన అమరావతిలో ఉంటుంది అని ఆయన స్పష్టం చేసారు.

ముఖ్యమంత్రి జగన్ కి, మూడు రాజధానుల కోసం పెయిడ్ ఆర్టిస్టులకు దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలి అని ఆయన ఆకాంక్షించారు. జగన్ తన మ్యానిఫెస్టోలో నవరత్నాల గురించి చెప్పారు కానీ రాజధానిని మూడు ముక్కలు చేస్తామని చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. రాజధాని అంశం రెఫరెండం గా ఎన్నికలు వెళ్లాలని ముస్లిం లీగ్ పార్టీ ఎప్పుడో వైసీపీకి సవాల్ చేసిందని ఆయన తెలిపారు. మా సవాల్ స్వీకరించలేక పులివెందుల బిడ్డ పిల్లిలా పారిపోయారు  అని మండిపడ్డారు. ఈ వి ఎంల వల్ల ముఖ్యమంత్రి అయిన జగన్ కి తాను సీఎం అయ్యాను అన్న సంగతి తెలియడం లేదు అని ఆయన  పేర్కొన్నారు.

ఇంకా పులివెందుల సర్పంచ్ గానే ఉన్నానని జగన్ అనుకుంటున్నారు అని ఆయన విమర్శించారు. మూడు రాజధానులు అంటున్న ముఖ్యమంత్రి గుంటూరు నడి బొడ్డులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా చివరిలో పెడతారా ? అని నిలదీశారు. ఒక కులంపై ఉన్న కక్షతో ముఖ్యమంత్రి జగన్  రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఎంపీలతో అమరావతి కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. పోలీసులతో రైతులపై దాడులు చేయిస్తున్నారు అని అన్నారు. ఇది పోలీసుల దౌర్జన్యకాండ కాదు జగన్ దౌర్జన్యకాండ అని మండిపడ్డారు. అమరావతి రాజధానిగా కొనసాగే వరకు రైతులతో పాటు మేము పోరాటం చేస్తాం అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: