గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం ఒక రేంజ్ లో కొనసాగుతోంది. తాజాగా బీజేపీపై అధికార టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఉరఫ్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల దగ్గర అసలు విషయం ఉండదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. బీజేపీ పార్టీ ఓట్ల కోసం మతం పేరుతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్‌ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ వివిధ విషయాలపై మాట్లాడారు. బీజేపీ నేతలకు దమ్ముంటే హైదరాబాద్‌కు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకురావాలని సవాల్ విసిరారు. గ్రేటర్ హైదరాబాద్ కు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ తెస్తే ప్రధాని మోదీని తాము కూడా పొగుడుతామని చెప్పారు.



అలాగే ఇక దేశానికి, ప్రజలకు బీజేపీ చేసింది ఏదీ లేదని అన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా కేంద్రం ఏమీ చేయలేదని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని చెప్పారు. రాజధాని శంకుస్థాపన సమయంలో అమరావతికి ఏం ప్రకటించారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. అమరావతికి నీళ్లు, మట్టి మాత్రమే కేంద్రం ఇచ్చిందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేంద్రంపై అటు కేసీఆర్.. ఇటు కేటీఆర్  వరుసగా తీవ్రమైన విమర్శలతో దాడి చేస్తున్నారు. అటు సీఎం కేసీఆర్‌ ఉరఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్నామని అన్నారు. ఎన్డీయేతర పార్టీలతో ఆయన త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. జాతి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని అన్నారు. దీంతో అటు కేసీఆర్... ఇటు కేటీఆర్ బీజేపీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక అతి త్వరలోనే జరుగనున్న ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీపైనే వారు గురి పెట్టి తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతిమంగా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి, అలాగే హైదరాబాద్‌ నగరానికి ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: