కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ... యడియూరప్పకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అసమ్మతి వర్గం కోపంతో రగిలిపోతోంది. సీడీ చూపించి బ్లాక్‌మెయిల్‌ చేసిన వాళ్లకు మంత్రిపదవులు ఇచ్చారని ఫైరవుతున్నారు అసమ్మతి నేతలు. అధికార పార్టీలో అసమ్మతి సెగలతో కన్నడ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి.

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం చిక్కుల్లో పడేలా ఉంది. మంత్రివర్గ విస్తరణతో రేగిన అసమ్మతి సెగలు... యడియూరప్ప సీఎం పదవికి ఎసరుపెట్టేలా ఉన్నాయి.  తాజాగా తన కేబినెట్ లోకి ఏడుగురు కొత్త వాళ్లను తీసుకున్నారు సీఎం యడియూరప్ప. అందులో నలుగురు ఎమ్మెల్యేలు కాగా, ముగ్గురు ఎమ్మెల్సీలు. అయితే మంత్రి వర్గంలో చోటు దక్కిన వాళ్లలో ముగ్గురు యడియూరప్ప సన్నిహితులనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు... మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వాళ్లు... యడియూరప్పపై భగ్గు మంటున్నారు. సీడీని చూపించి, ప్రభుత్వాన్ని పడగొడతామని బ్లాక్‌మెయిల్‌ చేసిన వాళ్లు, వీర విధేయులకు కేబినెట్లో స్థానం కల్పించారని విమర్శిస్తున్నారు అసమ్మతి నేతలు. భారీగా సొమ్ములు ముట్టజెప్పిన వాళ్లకు కూడా పదవువులు దక్కాయని ఆరోపిస్తున్నారు. విధేయత, కులం, సీనియారిటీ, సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించలేదని మండిపడ్డారు కొందరు సీనియర్‌ నేతలు.

2019 జులైలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు యడియూరప్ప. అయితే, కర్ణాటక బీజేపీలో కొంత కాలంగా వర్గపోరు నడుస్తోంది. సీఎం యడియూరప్పపై అసమ్మతి ఉంది. ఈ పరిస్థితుల్లో యడియూరప్ప ప్రభుత్వం మూడో సారి మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. అసమ్మతి నేతల్ని బుజ్జగించేందుకు ఈ విస్తరణ చేపట్టారు. ఏడుగురు కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. కానీ, పదవులు దక్కని వాళ్లు.. యడియూరప్పపై విరుచుకుపడుతున్నారు.     

యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌ కొంత కాలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ అధినాయకత్వం కూడా ఆ దిశగా పరిశీలన చేసింది. అయితే... కొంత కాలం యడియూరప్పను కొనసాగించాలని ఇటీవల నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణకు అధినాయకత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, మూడో సారి మంత్రివర్గాన్ని విస్తరించిన యడియూరప్ప... కొత్త చిక్కులు కొనితెచ్చుకున్నారు.  

మొత్తానికి యడియూరప్పను గద్దె దించే వరకూ నిద్రపోయేలా లేదు... అతని ప్రత్యర్థి వర్గం. మున్ముందు ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: