కడప జిల్లా పులివెందుల...అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఆ ఫ్యామిలీ తప్పా, మరో నాయకుడు గెలవలేదు. వైఎస్సార్, వైఎస్ వివేకా, వైఎస్ విజయమ్మ...ఇప్పుడు వైఎస్ జగన్ పులివెందుల గడ్డని ఏలుతున్నారు. అయితే ఇక్కడ వైఎస్ ఫ్యామిలీకి టీడీపీ పోటీ ఇవ్వలేక ప్రతిసారి చతికలపడుతుంది. కాకపోతే మొన్నటివరకు పులివెందులలో టీడీపీ చెప్పుకోవడానికి ఓ నాయకుడు ఉండేవారు. టీడీపీ నుంచి సతీశ్ రెడ్డి పోటీ చేసి వైఎస్ ఫ్యామిలీపై ఓడిపోతూ ఉండేవారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా సతీశ్, జగన్‌పై దాదాపు 90 వేల మెజారిటీతో ఓడిపోయారు.

గతంలో సతీశ్ ఇంత భారీ తేడాతో ఎప్పుడు ఓడిపోలేదు. పైగా జగన్ అధికారంలోకి రావడంతో చాలామంది టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. దీంతో పులివెందులలో సతీశ్ కూడా సైడ్ అయిపోయారు. ఎన్నికలైన ఏడాదికే సతీశ్ టీడీపీకి రాజీనామా చేసేశారు. అలా అని వేరే పార్టీలో చేరలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూ, తన సొంత పనులు చూసుకుంటున్నారు.

ఇక సతీశ్ టీడీపీని వీడటంతో చంద్రబాబు వెంటనే పులివెందులకు బీటెక్ రవిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి టీడీపీ తరుపున గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అటు శాసన మండలిలో అధికార వైసీపీకి ధీటుగానే నిలబడుతున్నారు. ఇలా టీడీపీ తరుపున గట్టిగా నిలబడుతున్న బీటెక్ రవి ఈ మధ్య ఓ కేసులో అరెస్ట్ అయ్యి తాజాగా బెయిల్ మీద బయటకొచ్చారు.

అయితే జైలు నుంచి వచ్చిన రవి సైలెంట్ అయిపోవచ్చని ప్రచారం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో రవి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా డౌటే అంటున్నారు. ఇదే సమయంలో సతీశ్ రెడ్డి రంగప్రవేశం చేసే ఛాన్స్ కూడా లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు బట్టి సతీశ్ ఎంట్రీ ఇచ్చి, మళ్ళీ పులివెందుల అభ్యర్ధిగా నిలబడొచ్చని టీడీపీ శ్రేణులు నమ్ముతున్నాయి. కానీ సతీశ్ పరిస్తితి చూస్తే మళ్ళీ రాజకీయాల్లోకి రావడం కష్టమే అని తెలుస్తోంది. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ ప్రత్యర్ధిగా ఎవరు ఉంటారో.    

మరింత సమాచారం తెలుసుకోండి: