పుర‌పాల‌క సంఘాల ఎన్నిక‌ల‌ను అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ పట్టు కోసం పట్టణాలే కీలకం కావటంతో వాటిని చేతుల్లోకి తీసుకునేందుకు శాయ‌శ‌క్తులా కృషిచేస్తున్నాయి. ఈనెల 3వ తేదీవరకు జరిగిన నామినేషన్ల ఉప సంహరణ ఒక ఎత్తు కాగా... బరిలోని అభ్యర్థులను గెలిపించుకోవడం మరో ఎత్తుగా ఇరుపార్టీల నేత‌లు భావిస్తున్నారు. మరోవైపు కొంత మంది అభ్యర్థులు ప్రలోభాలకు లొంగడంలేదు. బరిలో నిలుచునేందుకే ఆసక్తి చూపారు. వారిని న‌యానో, భ‌యానో లొంగ‌దీసుకునేందుకు అధికార‌పార్టీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అభ్య‌ర్థులంతా త‌మ బంధువులను  ప్రచార రంగంలోకి దించారు. పంపిణీ బాధ్యతలను అప్పగిస్తున్నారు. సోసల్‌ మీడియానూ ఉపయోగిస్తున్నారు. వలస ఓటర్లను సైతం రప్పించే పనుల్లో ఉన్నారు.

విజయనగరం నగరపాలక సంస్థ మొదటి మేయర్‌ పదవిని చేపట్టాలన్న ఉత్సుకత ఇరు పార్టీల్లో కనిపిస్తోంది. బీసీ మహిళకు కేటాయించిన ఈ పదవిని చేపట్టేందుకు ఇటు అధికార, అటు ప్రతి పక్ష పార్టీలు  అలుపెర‌గ‌కుండా కృషి చేస్తున్నాయి. రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ నెలకొంది. టీడీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులు కూడా ప్రచార వాడి పెంచారు. విజయనగరం నగరపాలక సంస్థలో 50వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో టీడీపీ, వైసీపీలు అభ్యర్థులను దింపాయి. బీజేపీ 18 డివిజన్లలోనూ, కాంగ్రెస్‌ పార్టీ 16 చోట్ల, జనసేన 12చోట్ల, సీపీఎం 1, బీఎస్‌పీ 4 చోట్ల అభ్యర్థులను పోటీలోకి దింపాయి. ఒక్క డివిజన్‌ కూడా ఏకగ్రీవం కాలేదు.

బొబ్బిలి మున్సిపాలిటీలో పోటీ రసవత్తరంగామారింది. టీడీపీ అభ్యర్థుల తరఫున మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బేబినాయన  ప్రచారం చేస్తున్నారు. పార్టీ ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన మీసాల గీత కూడా వీరికి జ‌త‌క‌లిశారు. మాజీ ఎమ్మెల్యే తెంటుతో పాటు పార్టీ శ్రేణులు టీడీపీ అభ్యర్థుల వెంట ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే ప్రచారంలో పాల్గొంటున్నారు.అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: