హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్ధతిస్తున్నట్టు బీసీీ సంక్షేమ సంఘం అధ్యక్షడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. నిన్న హైదరాబాద్ లో బీసీ ఉద్యోగ, కుల సంఘాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దళితబంధు లాగానే బీసీ బంధు అమలుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని.. వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని చెప్పారని కృష్ణయ్య తెలిపారు. అలాగే బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశారని స్పష్టం చేశారు.

అంతేకాదు మొన్నటికి మొన్న కేసీఆర్ ప్లీనరీలో కీలక ప్రకటన చేశారు. దళిత బంధుతో సంపద సృష్టి జరుగుతుందని అన్నారు. ఆ పథకం కోసం ప్రభుత్వం పెట్టే లక్షా 70వేల కోట్ల పెట్టుబడి.. లక్ష కోట్ల ఆస్తిని ఈ రాష్ట్రానికి తెచ్చిపెడుతుందని చెప్పారు. దళిత బంధుతో ఆగిపోమని.. ఎన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు. మిగతా వర్గాల పేదలకు త్వరలోనే ఇలాంటి పథకాలు ప్రకటిస్తామని చెప్పారు. సంవత్సరం అటు.. ఇటు అయినా దళిత బంధు లాంటి పథకం తీసుకొచ్చే శక్తి తమకు ఉందన్నారు.

ఇక హుజూరాబాద్ దళితులు అదృష్టవంతులు అనీ.. సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడ దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ పెట్టామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4తర్వాత ఎవరూ దాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం చిల్లరమల్లర పనులు మానుకోవాలని హెచ్చరిస్తున్నా అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లును గెలిపిస్తారని తనకు తెలుసన్నారు. నవంబర్-డిసెంబర్ నాటికి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పూర్తవుతుందని వివరించారు.

మొత్తానికి దళితబంధును ఆశగా చూపి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది టీఆర్ఎస్. నవంబర్ 4తర్వాత అకౌంట్లలో ఆడబ్బులు పడతాయంటూ ప్రచారం నిర్వహిస్తోంది. అటు బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఎన్నికల తర్వాత కేసీఆర్ సర్కార్ ప్రజలను పట్టించుకోదంటూ విమర్శిస్తున్నారు. ఒకవేళ అమలు చేస్తే... అన్ని వర్గాల వారికి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం ఇచ్చేలా టీఆర్ఎస్ ప్రవర్తిస్తోంది. అన్ని వర్గాల వారికి దళిత బంధు త్వరలో ఇస్తామని ప్రకటించింది. ఇదే ఇప్పుడు హుజూరాబ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించేలా కనిపిస్తోంది.  కేసీఆర్ అక్కడి ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోయినా దళిత బంధు తమను గెలిపిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. అటు బీసీ సంఘం నాయకుడు కృష్ణయ్య కూడా టీఆర్ఎస్ కు మద్దతివ్వడం ఆ పార్టీకి మైలేజ్ పెంచుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: