ఢిల్లీలో న‌డిపే రాజ‌కీయాల‌కు
గ‌ల్లీ లో న‌డిపే రాజ‌కీయాలకు
ఉన్న తేడా ఏంటో కేసీఆర్ మాటే చెబుతుంది
అంత‌కుమించి ఆయ‌న న‌డ‌వ‌డి చెబుతుంది

ఢిల్లీ పెద్ద‌ల‌తో చెడితే తిట్లు
స‌ఖ్య‌త ఉంటే ప్ర‌శంస‌లు అన్న విధంగానే
కేసీఆర్ రాజ‌కీయం న‌డిపి త‌న‌దైన పంథాలో
సాగిపోతున్నారు.
మ‌రి! బీజేపీ చెప్పిందంతా విన‌డంలో ఉన్న ఆంత‌ర్యం
ఆ పెద్దాయ‌నే చెప్పాలి. ఓ విధంగా తాక‌ట్టులో ఆ పార్టీ
ఎందుకు ఉండిపోతుందో కూడా.. పెద్ద అనుమాన‌మే
విప‌క్షాల‌కు?


 
ఇంటి పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎన్న‌డూ లేని విధంగా కొన్ని విష‌యాల్లో వెనుకంజ‌లోనే ఉంది. ధాన్యం కొనుగోలుపై కొంత హడావుడి చేసిన‌ప్ప‌టికీ  ఆ నిర‌స‌నల ఫ‌లితం ఎలా ఉండ‌బోతుంది అన్న‌ది కొంత ఆస‌క్తిదాయ‌క‌మే! రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు నిరుద్యోగ నివార‌ణ పై కానీ నీళ్ల పంపకంపై కానీ ఇప్ప‌టికీ ఓ స్ప‌ష్ట‌త లేదు. జోన‌ల్ సిస్ట‌మ్ ఫైన‌ల్ అయ్యాకే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని నోటిఫికేష‌న్లు వ‌స్తాయ‌ని మాత్రం కేసీఆర్ కాస్త ధీమాగా చెబుతున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికిప్పుడు  అవి కూడా న‌మ్మేలా లేవు. అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రాంతాలకు మాత్ర‌మే కేసీఆర్ ఆలోచ‌న‌లు కానీ హ‌రీశ్ రావు ప్ర‌ణాళిక‌లు కానీ ప‌రిమితం అయిపోయాయి. ఇప్ప‌టికీ చాలా బ‌స్ స్టేష‌న్లు క‌నీస సౌక‌ర్యాల‌కు నోచుకుని లేవు.


ఎన్నిక‌లు వ‌చ్చినా లేదా ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్లు ఉన్నా సంబంధిత సంద‌ర్భాల్లో వ‌రాలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి త‌రువాత కేసీఆర్ వాటి ఊసే మ‌రిచిపోతున్నార‌ని త‌రుచూ ప్ర‌తిపక్షం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది. కానీ కేసీఆర్ వాటిని వినిపించుకోవ‌డం లేదు. ప‌రిగ‌ణించ‌డం లేదు. రైతుల‌కు తామే అండ‌గా ఉంటామ‌ని, నిరుద్యోగ స‌మ‌స్య‌లను తానే దూరం చేస్తాన‌ని కేసీఆర్ చెప్పే క‌బుర్లు మాత్రం న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌నే అంటోంది. అయితే తెలంగాణ తెచ్చిన పార్టీకి ఇక్క‌డి స‌మ‌స్య‌లు తెలుసు అని వాటిపై త‌మ‌కు పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న ఉంద‌ని మాత్రం కేసీఆర్ అంటున్నారు.

ఇక రాజ‌కీయం విష‌యానికే వ‌స్తే.. :
గులాబీ దండు అధికారంలోకి రాగానే అనేక హామీలూ అంచ‌నాలూ ఉన్నాయి ఆ రోజు. వాటిని అందుకోవ‌డంలో వాటిని నెర‌వేర్చ‌డంలో కేసీఆర్ విఫ‌లం అయి ఉన్నార‌ని విప‌క్షం అంటోంది. కేవ‌లం మాట‌లు వ‌రకే ఆయ‌న ప‌రిమితం అని ఇక్క‌డ తిట్టి ఢిల్లీలో బీజేపీ బంధాలు నడ‌ప‌డంలో కేసీఆర్ చాణ‌క్య నీతి ఏంట‌న్న‌ది రాజ‌కీయం తెలిసిన వారంద‌రికీ ఇట్టే అర్ధం అవుతుంద‌ని ప‌లుమార్లు టీపీసీసీ ఆరోపించింది. ఏ విధంగా చూసినా ఢిల్లీ బంధాల‌లో కేసీఆర్ టాప్ లో ఉన్నార‌ని కూడా అంటున్నారు ఇంకొంద‌రు. ఆ రోజు పార్టీ విలీనం చేయ‌కుండా కాంగ్రెస్ కు, ఇప్పుడు బీజేపీతో నేరుగా పొత్తు లేకుండా స్నేహాలు కొన‌సాగిస్తూ మోడీకి ఆయ‌న అర‌చేతిలో స్వ‌ర్గం చూపిస్తున్నార‌ని ఇంకొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. అయితే జాతీయ పార్టీల‌కు స్థానికంగా నిల‌దొక్కుకునే అవ‌కాశం లేకపోవ‌డంతో స్థానిక పార్టీలను కొన్ని వ్యూహాల‌కు పావులుగా వాడుకుంటున్నాయ‌న్న విమ‌ర్శ కూడా ఉంది. వీటిని కేసీఆర్ పట్టించుకోవ‌డం లేదు స‌రికదా! ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ అక్క‌డి పాల‌కుల‌కు, కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు స‌న్మానాలు మాత్రం చేసి వ‌స్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న వంగి వంగి వారికి దండాలు పెడుతున్న తీరే ఆయ‌నేంటో చెప్ప‌క‌నే చెబుతోంద‌ని విప‌క్షం పెద‌వి విరుస్తోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ కు బీజేపీకి ఉన్న బంధాలు ఇప్ప‌ట్లో తెగ‌వు..తెగిపోవు కూడా అన్న‌ది రాజ‌కీయ ప‌రిశీల‌కుల మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: