తుపాను అంటే గతంలో భయపడే పరిస్థితి. కానీ ప్రస్తుతం చిన్న వర్షం కురుస్తున్నా కూడా నెల్లూరు వాసి వణికిపోతున్నాడు. బాబోయ్ మళ్లీ వర్షమా అని కలవరపడుతున్నారు కూడా. ఇప్పటికే దాదాపు 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లా పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. ఇంకా చెప్పాలంటే... ఇప్పటికే కొన్ని గ్రామాలు వరద నీటిలో నానుతూనే ఉన్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఒక్క నెల్లూరు జల్లాలోనే వెయ్యి కోట్ల రూపాయలు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. తీర ప్రాంతమైన నెల్లూరు జిల్లాపై వరుణుడు పగ బట్టాడేమో అనేలా పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మరోసారి వర్షాలు నెల్లూరు జిల్లాను ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు ఇప్పుడు తుపాను కూడా తోడయ్యింది. దక్షిణ థాయిలాండ్ వద్ద అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఆంధ్ర, ఒడిశా తీరం వైపు తరుముకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెల్లూరుకు దాదాపు 14 వందల కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.

డిసెంబల్ 3వ తేదీకి వాయుగుండం కాస్తా తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు జవాద్ అని పేరు పెట్టారు అధికారులు. ఈ నెల 5, 6వ తేదీల్లో కళింగపట్నం, పారాదీప్ మధ్యలో జవాద్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే జవాద్ ప్రభావం అధికంగా ఆంధ్రప్రదేశ్ ‌రాష్ట్రంపైనే ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖ,విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అధికారులు. మత్య్సకారులు మరో వారం రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: