తాజాగా జాతీయమీడియా సంస్ధలు నిర్వహిస్తున్న సర్వేలు, వాటి ఫలితాలతో వైసీపీ శ్రేణుల్లో బాగా జోరు కనబడుతోంది. అయితే ఈ సర్వేలను నమ్ముంటే ముణిగిపోవటం ఖాయం. ఎందుకంటే సర్వేలన్నీ వాస్తవాలే అని నూరుశాతం నమ్మేందుకు లేదు. పైగా ఇఫుడు చేస్తున్న సర్వేలన్నీ ఈరోజుకు మాత్రమే పరిమితమని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ కాలముంది కాబట్టి. షెడ్యూల్ ఎన్నికల్లోగా ఎప్పుడేమవుతుందో ఎవరు చెప్పలేరు.

ఒక్కచిన్న ఘటన చాలు పరిస్ధితులు తారుమారైపోవటానికి. ఇంతకీ వైసీపీలో ఈ జోరు కనబడటానికి కారణం ఏమిటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీకి సుమారు 20 సీట్లు గ్యారెంటీ అని జాతీయ మీడియాలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడయ్యాయట. జూలై 30వ తేదీన ఇండియా టుడే టీవీ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగానే ఏపీలో కూడా చేసింది. ఆ సర్వేలో వైసీపీకి 19 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చింది.

ఇక ఆగష్టు 11వ తేదీన ఇండియా టు డే-సీ ఓటర్ కలిపి మరో సర్వే ఫలితాలను విడుదలచేశాయి. దాని ప్రకారం వైసీపీకి 18 ఎంపీలు వస్తాయని తేలింది. ఇక తాజాగా అంటే ఆగస్టు 15వ తేదీన టైమ్స్ నౌ అనే ఛానల్ నిర్వహించిన సర్వేలో వైసీపీకి 17-23 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. సర్వేలు చేసినవన్నీ ప్రముఖ మీడియా సంస్ధలే అనటంలో సందేహంలేదు. కాకపోతే అవి నిర్వహించిన సర్వేలన్నీ కేవలం లోక్ సభ సీట్ల విషయంలో మాత్రమే.

అయితే వాటినే అసెంబ్లీ సీట్లకు వర్తింపచేసుకుంటే తక్కువలో తక్కువ 100-110 సీట్లతో జగన్ రెండోసారి అధికారంలోకి రావటం ఖాయమని పార్టీ నేతలు మహా సంతోషంగా ఉన్నారు. ఇక్కడే పార్టీనేతలు బోల్తాపడే అవకాశముంది. 2014 ఎన్నికల్లో కూడా ఇలాంటి సర్వేలు+జగన్ మీడియా సొంతంగా నిర్వహించుకున్న సర్వేలో కూడా జగన్ సీఎం అవ్వటం గ్యారెంటీ అని తేలింది. కానీ చివరకు జరిగిందేమిటి ? ఐదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇలాంటి సర్వేలన్నీ జనాభిప్రాయానికి జస్ట్ శాంపుల్ గా మాత్రమే పనికొస్తుంది. కాబట్టి దీన్నే నమ్ముకుని రిలాక్సయిపోతే టే పుట్టిముణిగటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: